ఏపీలో మూతపడనున్న ఎయిడెడ్ పాఠశాలలు !
1 min readపల్లెవెలుగువెబ్ : ఏపీలో వందల ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలలు మూతపడనున్నాయి. రాష్ట్రంలో 418 ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలపై వేటు వేయనున్నారు. ఈ పాఠశాలలన్నింటినీ మూసేసే దిశగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పాఠశాలల్లో ఒక్కోదానిలో 8 నుంచి 35 మంది వరకు విద్యార్థులు చదువుతున్నారు. అయితే ఈ సంఖ్య సరిపోదని.. విద్యార్థుల ప్రవేశాలు పెంచుకోవాలని గత ఏడాది కొన్ని పాఠశాలలకు నోటీసులిచ్చారు. విద్యార్థుల సంఖ్య పెంచుకుంటేనే పాఠశాలలు నడిచేందుకు అనుమతి ఉంటుందని.. లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొన్ని పాఠశాలలు విద్యార్థుల ప్రవేశాలను పెంచుకోగా వాటిని మినహాయించి.. 418 పాఠశాలలపై చర్యలు తీసుకోవాలంటూ రెండురోజుల క్రితం పాఠశాల విద్య కమిషనర్ ఎస్. సురేశ్‌కుమార్ ఉత్తర్వులిచ్చారు. కొన్ని పాఠశాలల్లో అసలు విద్యార్థులే లేరన్న విషయం కూడా వెలుగులోకి వచ్చింది. దీంతో చట్టప్రకారం వీటిపై చర్యలు తీసుకోవాలంటూ ప్రాంతీయ సంయుక్త డైరక్టర్లకు కమిషనర్ ఆదేశాలు జారీచేశారు.