డయాలసిస్ సేవలను విస్తరించిన ఏఐఎన్‌యూ
1 min read– ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ
– ప్రస్తుతం నెలకు 800 డయాలసిస్‌ల నుంచి ఇప్పుడు 1200 డయాలసిస్‌లు చేయగలుగుతున్న ఆస్పత్రి
పల్లెవెలుగు వెబ్ హైదరాబాద్: డయాలసిస్ సేవలకు పెరుగుతున్న డిమాండుకు అనుగుణంగా, ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) ఆస్పత్రి తమ దిల్‌సుఖ్‌నగర్ యూనిట్‌లో 50% సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు బుధవారం ప్రకటించింది. ప్రస్తుతం నెలకు 800 సెషన్లు చేస్తుండగా, ఇకపై ఏఐఎన్‌యూ యూనిట్‌లో నెలకు 1200 డయాలసిస్ సెషన్లు చేయగలదు. జీహెచ్ ఎంసీలో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేసి, పదవీ విరమణ చేసిన 82 ఏళ్ల డయాలసిస్ పేషెంట్ పి.కిష్టయ్య ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఆయన గత 7 ఏళ్లుగా డయాలిసిస్ చేయించుకుంటూ, ఆరోగ్యంగా ఉన్నారు.ఈ ప్రాంతంలో చాలావరకు ఆస్పత్రులు ప్రాథమిక డయాలసిస్ సేవలనే అందిస్తున్నాయి. కానీ ఏఐఎన్‌యూ మాత్రం, ప్రపంచంలోనే అత్యాధునిక తరహా డయాలసిస్ పద్ధతి అయిన హెమోడయాఫిల్ట్రేషన్ (హెచ్‌డీఎఫ్) సేవలను అందించడానికి అవసరమైన సాంకేతికతను అందిపుచ్చుకుంది. హెచ్‌డీఎఫ్ అనేది ప్రియాంబుల్ మెంబ్రేన్‌ను ఉపయోగించి చేసే ఒక ఎక్‌స్ట్రా కార్పోరియల్ మూత్రపిండ-మార్పిడి పద్ధతి. దీనిలో ద్రావణాల తొలగింపును పెంచడానికి వ్యాప్తి, ఉష్ణప్రసరణలను సౌకర్యవంతంగా కలుపుతారు.సామర్థ్యాన్ని పెంచిన సందర్భంగా ఈ కేంద్రం డైరెక్టర్, సీనియర్ యూరాలజిస్టు డాక్టర్ ఎన్.శ్రీనివాస్ మాట్లాడుతూ, “భారతదేశంలో.. అందునా హైదరాబాద్‌లో మూత్రపిండాల వ్యాధులు విస్తరిస్తున్నాయి. అందువల్ల డయాలసిస్ సేవలకు కూడా డిమాండు రోజురోజుకూ పెరుగుతోంది. వీలైనంత అత్యుత్తమ డయాలసిస్ సేవలను రోగులకు అందించడం ఇప్పటి అవసరం. అదికూడా ఇన్ఫెక్షన్లకు తావులేని విధంగా చేయాలి. అత్యాధునిక టెక్నాలజీలను అందిపుచ్చుకోవడంలో ఏఐఎన్‌యూ ఎప్పుడూ ముందంజలో ఉంది. ఈ కొత్త యూనిట్‌లో అత్యాధునిక హెచ్‌డీఎఫ్ చికిత్స కూడా అందిస్తున్నాం” అన్నారు. ఏఐఎన్‌యూ దిల్‌సుఖ్‌నగర్ శాఖకు చెందిన సీనియర్ నెఫ్రాలజిస్టు, ఆ విభాగాధిపతి డాక్టర్ పీఎస్ వలీ మాట్లాడుతూ, “రోగులకు వ్యక్తిగత శ్రద్ధతో అంతర్జాతీయ స్థాయి డయాలసిస్ సేవలను ఏఐఎన్‌యూ దిల్‌సుఖ్‌నగర్ శాఖ అందిస్తుంది. అత్యాధునిక హెచ్‌డీఎఫ్ టెక్నాలజీ, ఒక్కసారి మాత్రమే వాడే పరిశుభ్రమైన ప్రోటోకాల్స్ ఉపయోగించి.. రోగుల దీర్ఘకాల ఆరోగ్యం, జీవన నాణ్యతను మెరుగుపరిచేలా, గుండె ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉండేలా చూసుకుంటాం. డయాలసిస్ విషయంలో ఏఐఎన్‌యూ సరికొత్త ప్రమాణాలను నిర్దేశిస్తుందని నేను గర్వంగా చెప్పగలను” అని వివరించారు. ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) ఉమ్మడి డయాలసిస్ సామర్థ్యం ప్రస్తుతం ప్రతినెలా 4వేలకు పైగా డయాలసిస్ సెషన్లుగా ఉంది. ప్రస్తుత విస్తరణతో ఈ సామర్థ్యం మరింత పెరుగుతుంది.