నష్టాల్లో ఎయిర్ లైన్స్ ఇండస్ట్రీ.. ఝున్ ఝున్ వాలా ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు ?
1 min readపల్లెవెలుగు వెబ్: విమానయాన రంగం పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయింది. మూలిగే నక్క పై తాటిపండు పడ్డట్టు కరోన దెబ్బకు ఎయిర్ లైన్స్ ఇండస్ట్రీ కుదేలైపోయింది. ఎయిల్ లైన్స్ వ్యాపారం నడపడమంటేనే కత్తి మీద సాముగా మారింది. మరి అలాంటి రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ ఝున్ వాలా ఎందుకు ముందుకు వస్తున్నారన్న ప్రశ్న అందరిలోనూ మొదలైంది. ‘ఆకాశ’ పేరుతో రాకేష్ ఝున్ ఝున్ వాలా ఎయిర్ లైన్స్ సంస్థను ప్రారంభించనున్నారు. ఇప్పటికే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. ఈ సంస్థలో రాకేష్ 35 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టబోతున్నారు. సుమారు 40 శాతం వాటాను రాకేష్ తీసుకోబోతున్నారు. నాలుగేళ్లలో సుమారు 70 విమానాలు సమకూర్చుకోవాలన్నది రాకేశ్ ప్లాన్. ఈ ఎయిర్ క్రాఫ్ట్ సామర్థ్యం సుమారు 180 మంది ప్రయాణీకులు ప్రయాణించేంత ఉంటుంది. టికెట్ ధరలు కూడ చాలా తక్కువగా ఉండనున్నాయని రాకేష్ ఝున్ ఝున్ వాలా చెప్పారు.
అల్ట్రా లో కాస్ట్ లో టికెట్ ధరలు ఉంటాయని ఆయన ఇప్పటికే ప్రకటించారు. భారత విమానయాన రంగం వృద్ధి పై పూర్తీ నమ్మకంతో ఉన్నట్టు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. టికెట్ ధరలు తక్కువగా ఉండటం వల్ల ఎక్కువ మంది ప్రయాణించే అవకాశం ఉంటుందనేది ఆయన అంచనా. తద్వార ఎందరికో కలగా మారిన విమానయానాన్ని ఆయన నిజం చేయబోతున్నారు. అయితే.. ఇప్పటికే తీవ్ర నష్టాలతో ఉన్న విమానయానం రంగంలో విజయం సాధించడం ఆషామాషీ వ్యవహారం కాదని పలువురు ఇండస్ట్రీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విమాన ఇంధనం ధరలు ఇండస్ట్రీకి ఓ పెద్ద సవాలు. వీటితో పాటు పార్కింగ్ ఫీజు లాంటి కొన్ని ఫిక్స్డ్ కాస్ట్ లు పెద్ద తలనొప్పిగా మారాయి. మరి ఇప్పటి వరకు నష్టాల్లో ఉన్న ఎయిర్ లైన్స్ ఇండస్ట్రీ లో రాకేష్ ఝున్ ఝున్ వాలా ఎలా విజయం సాధించి.. కంపెనీని లాభాల బాట పట్టిస్తారనేది వేచిచూడాల్సిందే.