PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యార్థులందరూ తప్పనిసరిగా అల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలి

1 min read

జిల్లా కలెక్టర్ డా.జి.సృజన

పల్లెవెలుగు వెబ్ కర్నూలు : విద్యార్థులందరూ తప్పనిసరిగా అల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన సూచించారు.శుక్రవారం నగరంలోని ఇందిరాగాంధీ మెమోరియల్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ అల్బెండజోల్ మాత్రల విద్యార్థులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకు ఒక సారి 1సం. నుండి 19 సం.ల లోపు చిన్నారులకు, విద్యార్థులకు తప్పనిసరిగా అల్బెండజోల్ మాత్రలను అందజేయడం జరుగుతుందన్నారు. 1సం. నుండి 2సం.లు ఉన్న చిన్నారులకు సగం మాత్ర, 3సం.ల నుండి 19సం.ల ఉన్న వారికి ఒక మాత్ర వేసుకోవాలన్నారు. నులిపురుగులు శరీరంలో ఉండడం వల్ల చదువులో ఏకాగ్రత లోపించడంతో పాటు శరీరంలో రక్తహీనత, ఆకలి లేకపోవడం, బలహీనత, కడుపునొప్పి, వికారం, విరోచనాలు, బరువు తగ్గడంతో పాటు అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయన్నారు. విద్యార్థులు ఈ మాత్రలు తీసుకోవడం వల్ల శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందన్నారు. సదరు మాత్రలను అంగన్వాడీ కార్యకర్తలు, విద్యాశాఖ, ఆరోగ్యశాఖ తరఫున అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూలు మరియు ఇంటర్మీడియేట్ కళాశాలలు, ప్రభుత్వ వసతి గృహాలు, స్కూల్లో లేకపోయినా పిల్లలందరికీ కూడా మాత్రలను వేయడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. దేశం మొత్తంలో ఈ రోజు అల్బెండజోల్ మాత్రలను పిల్లలకు పంపిణీ జరుగుతుందని, ఒక వేళ ఈ రోజున మాత్రలు వేసుకోని పక్షంలో వారికి మళ్ళీ మాప్ అప్ కార్యక్రమం ద్వారా ఈనెల 16వ తేదీన అల్బెండజోల్ మాత్రలను అందజేయడం జరుగుతుందన్నారు. నులిపురుగుల నివారణకు గాను బహిరంగ ప్రదేశాలలో ఆడుకునేటప్పుడు పాదరక్షలు లేకుండా తిరగకూడదని, భోజనానికి ముందు, భోజనం తరువాత 20 సెకన్లు చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలని, దీనితో చాలా వరకు నులిపురుగులు నివారణ తగ్గుతుందన్నారు.అనంతరం జిల్లా కలెక్టర్ పదవ తరగతి విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. ఈ మాత్రలను అందరికీ పంపిణీ చేయాలని వైద్యాధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ రామ గిడ్డయ్య, ఐసిడిఎస్ పిడి వెంకటలక్ష్మీ, డిఈఓ శామ్యూల్, ఆర్బిఎస్కె కో-ఆర్డినేటర్ డా.హేమలత, మెడికల్ ఆఫీసర్ మాధవి, డిప్యూటీ డెమో చంద్రశేఖర్, డిఐసి మేనేజర్ ఇర్ఫాన్ బాషా, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

About Author