ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు సర్వం సిద్ధం
1 min read– జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు సర్వం సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు పేర్కొన్నారు.శనివారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ పై జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ఈ నెల 13 వ తేదీన పోలింగ్ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుందన్నారు.. టీచర్స్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ అనంతపురంలోను, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కౌంటింగ్ కర్నూలు లో జరుగుతుందని తెలిపారు. కర్నూలు జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 74 పోలింగ్ కేంద్రాలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 27 పోలింగ్ కేంద్రాలు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కర్నూలు, నంద్యాల జిల్లాలలో 6 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ వివరించారు.
ఓటర్ల సంఖ్య, ఓటర్ స్లిప్ ల పంపిణీ
పట్టభద్రుల ఓటర్లు 61,633 ఉన్నారని, ఉపాధ్యాయ ఓటర్లు 5,391 మంది ఉన్నారని మరియు స్థానిక సంస్థల ఓటర్లు 1178 మంది ఉన్నారని పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్ ఓటర్లకు 93%, టీచర్స్ ఓటర్లకు 89%, స్థానిక సంస్థల ఓటర్లకు 100 శాతం ఓటర్ స్లిప్స్ పంపిణీ చేశామని జిల్లా కలెక్టర్ వివరించారు..
పోలింగ్ సిబ్బంది నియామకం: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు 74 మంది పీవోలు, 74 మంది ఏపీవోలు,148 మంది ఓ పి ఓ లను నియమించామన్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు 27 మంది పిఓలు, 27 మంది ఏపీవోలు,54 మంది ఓపిఓలను నియమించామన్నారు.. రిజర్వులో 34 మంది పిఓలు, 34 మంది ఏపీవోలు, 68 మంది ఓపిఓలు రిజర్వులో ఉంచామన్నారు. స్ధానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు 6 మంది పీవోలు, 6 మంది ఏపీవోలు, 12 మంది ఓపిఓలను నియమించగా ఒక పిఒ, ఒక ఏపీఓ, ముగ్గురు ఓపివోలను రిజర్వులో ఉంచామన్నారు. కాగా అన్ని పోలింగ్ స్టేషన్లకు ఒక్కొక్కరు చొప్పున 107 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించామని, 22 మంది మైక్రో అబ్జర్వర్లను రిజర్వులో ఉంచామని కలెక్టర్ వివరించారు..వీరందరికీ ఎన్నికల విధులు కేటాయిస్తూ ఉత్తర్వులు పంపామని తెలిపారు..ఎన్నికలు జరిగే ప్రాంతాలను 16 రూట్లుగా విభజించి 16 మంది జోనల్ ఆఫీసర్లను, 17 మంది రూట్ ఆఫీసర్లను నియమించామన్నారు..
అభ్యర్థులు:గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి 49 మంది అభ్యర్థులు,టీచర్స్ ఎమ్మెల్సీకి 12 మంది అభ్యర్థులు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నారన్నారు.
డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్ల వివరాలుడిస్ట్రిబ్యూషన్ మరియు రిసెప్షన్ సెంటర్ లను మూడు రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు.. ఆదోనిలో సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, కర్నూలులో సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల, పత్తికొండలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ మరియు రిసెప్షన్ సెంటర్ లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు…ఇక్కడే స్ట్రాంగ్ రూమ్ లను కూడా ఏర్పాటు చేశామన్నారు..
కౌంటింగ్:స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ కర్నూలు నగరంలోని సిల్వర్ జూబ్లీ కళాశాలలో జరుగుతుందని పేర్కొన్నారు. పట్టభద్రుల మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బ్యాలెట్ బాక్సులను పటిష్ట బందోబస్తు నడుమ అనంతపురం కౌంటింగ్ సెంటర్ కు పంపించడం జరుగుతుందని తెలిపారు.. స్ట్రాంగ్ రూమ్ లలో సీసి కెమెరాలు, వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని, పొలిటికల్ పార్టీ ల ప్రతినిధులు స్ట్రాంగ్ రూమ్ పరిధిలో ఉండే అవకాశం కూడా కల్పించామన్నారు.
వెబ్ కాస్టింగ్:ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామని, 56 క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో వీడియోగ్రఫీ కూడా ఏర్పాటు చేశామన్నారు.
డ్రై డే:ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా వారి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా అంతటా పోలింగ్ కు 48 గంటలు ముందు అనగా 11 వ తేదీ సాయంత్రం 4 గంటల నుండి 13 వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు, అలాగే కౌంటింగ్ రోజు 16 వ తేదీన కర్నూలు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో డ్రై డే డిక్లేర్ చేశామన్నారు. ఈ సమయంలో ఎలాంటి మద్యం షాపులు తెరవకుండా కూడా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
పబ్లిక్ హాలిడే:ఈ నెల 13 వ తేదీ పోలింగ్ మరియు 16 వ తేదీన కౌంటింగ్ సందర్భంగా పోలింగ్ కేంద్రాలు, డిస్ట్రిబ్యూషన్ మరియు రిసెప్షన్ సెంటర్లు, కౌంటింగ్ సెంటర్ లకు వినియోగించే భవనాలు, విద్యా సంస్థలకు పబ్లిక్ హాలిడే ప్రకటించడం జరిగిందని అన్నారు.
48 గంటలు ముందుగా ప్రచారం నిషేధం:ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు పోలింగ్ కు 48 గంటలు ముందుగా ప్రచారంపై నిషేధం విధించామన్నారు. 11 వ తేదీ సాయంత్రం 4 గంటల నుండి ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాల ద్వారా గాన, బల్క్ ఎస్ఎంఎస్ ల ద్వారా గాని, ఇతరత్రా ఏ విధమైన ప్రచార కార్యక్రమాలు గాని నిర్వహించకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు.
పది రకాల ఓటరు గుర్తింపు కార్డులు:
ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా వారి ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాలలో ఓటర్ గుర్తింపు కార్డు గా 10 రకాల కార్డులను అనుమతించడం జరుగుతుందని పేర్కొన్నారు..
1)ఆధార్
2) డ్రైవింగ్ లైసెన్స్
3) పాన్ కార్డ్
4)ఇండియన్ పాస్పోర్ట్
5) ఫోటోతో కూడిన ఎంప్లాయీ గుర్తింపు కార్డు
6) ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అఫీషియల్ ఐడికార్డ్స్
7) టీచర్లు మరియు ఉద్యోగులుగా ఉన్న పట్టభద్రులకు సంబంధిత సంస్థలు జారీ చేసిన సర్వీస్ ఐడెంటిటీ కార్డ్
8) యూనివర్సిటీ జారీ చేసిన ఒరిజినల్ డిగ్రీ లేదా డిప్లమా సర్టిఫికెట్
9) వికలాంగులకు సంబంధిత సంస్థలు జారీ చేసిన ఒరిజినల్ సర్టిఫికెట్
10) కేంద్ర ప్రభుత్వ సోషల్ జస్టిస్ మరియుఎంపవర్మెంట్ మంత్రిత్వ శాఖ జారీచేసిన యూనిక్ డిజేబులిటీ కార్డ్
పై పేర్కొన్న పాత్రల్లో ఏదో ఒక కార్డు ను చూపించ వచ్చని కలెక్టర్ వివరించారు..
జాయింట్ కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 6 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ఈ నెల 13 వ తేదీ ఉదయం 8 నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. ఇందుకు సంబంధించి స్ట్రాంగ్ రూమ్ ను కర్నూలు నగరంలోని సిల్వర్ జూబ్లీ కళాశాలలో ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. కౌంటింగ్ కి సంబంధించి ప్రతి అభ్యర్థి ఒక కౌంటింగ్ ఏజెంట్ ని నియమించుకోవచ్చన్నారు..ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ లో గుర్తులు ఉండవని, అభ్యర్థుల పేరుకు ఎదురుగా అంకెల తోనే ఓటు వేయాల్సి ఉంటుందన్నారు. ఒకటి అని కానీ, ఇంగ్లీష్ లో కూడా వన్ అని కాని రాయకూడదన్నారు .. ప్రాధాన్యతా క్రమంలో అభ్యర్ధులందరికీ ఓటు వేయవచ్చునని సూచించారు. అయితే ఒకరికి ఒక ప్రాధాన్యతా సంఖ్యను మాత్రమే వేయాలన్నారు. నచ్చిన ఎవరో ఒక అభ్యర్థికి తప్పనిసరిగా 1వ నెంబరు వేయాల్సి ఉంటుందన్నారు..ఎవరికైనా 1వ ప్రాధాన్యతా ఓటు వేసిన తరువాత ఇష్టం లేకపోతే, మిగిలిన అభ్యర్థులకు ఓటువేయకుండా వదిలేయవచ్చునన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఇచ్చే వైలెట్ పెన్ మాత్రమే వాడాలని, సొంత పెన్ వాడ కూడదని జేసీ వివరించారు.అడిషనల్ ఎస్పీ ప్రసాద్ మాట్లాడుతూ కర్ణాటక, తెలంగాణ సరిహద్దుల్లో 12 చెక్పోస్టులు ఏర్పాటు చేశామని, ప్రతి మండలంలో ఫ్లయింగ్ స్కార్డులు ఏర్పాటు చేశామని, బందోబస్తు కోసం 1124 మందిని పోలీసులను నియమించామని తెలిపారు.ప్రెస్ కాన్ఫరెన్స్ లో జిల్లా రెవెన్యూ అధికారి నాగేశ్వర రావు పాల్గొన్నారు.