ముస్లీంలందరూ వచ్చే ఎన్నికల్లో టిడిపికి ఓటు వేయాలి..
1 min readమాజీ శాసనమండలి ఛైర్మన్ ఎం.ఎ షరీఫ్
కర్నూలు ప్రజలకు సేవ చేసే టి.జి భరత్‌ను ఎమ్మెల్యేగా గెలిపించాలి.. ఎం.ఎ షరీఫ్
మౌర్య ఇన్‌లో కర్నూలు నగర ముస్లీం మైనారిటీల ఆత్మీయ సమావేశం
సమావేశంలో పాల్గొన్న కర్నూలు టిడిపి ఇంచార్జి టి.జి భరత్, మైనారిటీ రాష్ట్ర అధ్యక్షులు ముస్తాక్ మౌలాన, జనసేన అసెంబ్లీ ఇంచార్జి అర్షద్, ముఖ్య నేతలు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ముస్లీంల ఓట్లతో ఎన్నికల్లో గెలిచిన నేతలు ముస్లింలకు ఏం చేశారని మాజీ శాసనమండలి చైర్మన్ ఎం.ఎ షరీఫ్ ప్రశ్నించారు. కర్నూలు నగరంలోని మౌర్య ఇన్‌లో మైనారిటీ నగర కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ముస్లీం, మైనారిటీల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో కర్నూలు టిడిపి ఇంచార్జి టి.జి భరత్, మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులు ముస్తాక్ మౌలాన, జనసేన కర్నూలు అసెంబ్లీ ఇంచార్జి అర్షద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టి.జి కుటుంబం అంటే నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తుందన్న విషయం అందరికీ తెలుసన్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో టి.జి భరత్‌ను గెలిపించాలని ఆయన కోరారు. ఇప్పుడు అధికారంలో ఉన్న ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ప్రజలకు ఏమీ చేయలేదన్నారు. వక్ఫ్ బోర్డు భూములను కాపాడటంలో ఆయన విఫలమయ్యారన్నారు. కర్నూల్లో లక్షకు పైగా ఉన్న ముస్లింలకు న్యాయం జరగాలా, లేదా హఫీజ్ ఖాన్ ఒక్కరికి న్యాయం జరగాలా అని అన్నారు. టి.జి కుటుంబం ముస్లీంలకు ఎంతో సేవ చేసిందన్నారు. ప్రతి ముస్లీం ఇప్పటికైనా మేల్కోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలన్నారు. మతం చూడకుండా ముస్లీంలకు మంచి చేసే వ్యక్తికే ఓటు వేయాలని, ఈ విషయాలను ప్రతి ఒక్క ముస్లీంకు తెలపాలని ఆయన నాయకులకు సూచించారు.అనంతరం మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులు ముస్తాక్ మౌలాన మాట్లాడుతూ వైసీపీకి ముస్లీంలపై ప్రేమ ఉంటే ఉర్దూ యూనివర్శిటీ ఎప్పుడో పూర్తయ్యేదన్నారు. ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గురించి ఇప్పుడు అందరికీ తెలిసిపోయిందన్నారు. ఆయన ఓట్ల కోసం ముస్లీంల వద్దకు వచ్చి నటిస్తారన్నారు. చంద్రబాబు హయాంలో దుల్హన్ పథకం ద్వారా రూ. 50 వేలు ఇస్తే.. ఈ ప్రభుత్వం లో 10వ తరగతి చదవాలని రూల్స్ పెట్టారన్నారు. ముస్లీంల పెళ్లిల్లకు లక్ష రూపాయలు ఇస్తానని చెప్పిన సమయంలోనే ఈ నిబంధనలు ఉంటాయని చెప్పాల్సిందని మండిపడ్డారు. ఇక కర్నూల్లో జరుగుతున్న రాజకీయాలను తాను గమనిస్తూనే ఉన్నానని ముస్తాక్ అన్నారు. ఇక్కడ మౌలానాలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారన్నారు. కర్నూలు అభివృద్ధి చెందాలంటే నిస్వార్థంగా సేవ చేస్తున్న టి.జి భరత్‌ను ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన ముస్లీంలను కోరారు.అనంతరం టి.జి భరత్ మాట్లాడుతూ ఈ రోజు రాష్ట్రం మూడు ముక్కలవ్వకుండా ఉందంటే మూడు రాజధానుల బిల్లు శాసనమండలికి వచ్చినప్పుడు దానిని ఆమోదించకుండా సెలక్ట్ కమిటీకి పంపిన ఎం.ఎ షరీఫ్ కారణమన్నారు. లేదంటే అక్కడో రాజధాని, ఇక్కడో రాజధాని అంటూ రాష్ట్రంలో మూడు రాజధానులుండేవన్నారు. ఆ సమయంలో ఆయనపై ఇష్టానుసారంగా మాట్లాడినా ఓపికతో వ్యవహరించిన తీరు ఎంతో గొప్పదన్నారు. ఇక కర్నూల్లో ఉన్న నాయకులు ఓట్ల కోసం ఎన్ని నాటకాలైనా ఆడతారని చెప్పారు. ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లో ఉన్న తమ టి.జి కుటుంబాన్ని ఓడించేందుకు జాయింట్ యాక్షన్ కమిటీ ( జే.ఏ.సీ)లు ఏర్పాటు చేసుకుంటారన్నారు. ముస్లీంలకు ఎంతగానో ఉపయోగపడే ఉర్దూ యూనివర్శిటీ నిర్మాణం పూర్తవ్వకపోతే జేఏసీ ఎందుకు ఏర్పాటుచేయలేదని, నంద్యాలలో ముస్లీం కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే వారికి న్యాయం చేసేందుకు జేఏసీ ఎందుకు ఏర్పాటు కాలేదని ప్రశ్నించారు. ఎన్నికల్లో మేము పోటీ చేస్తున్న సమయంలోనే జేఏసీలు పుట్టుకొస్తాయన్నారు. ముస్లీంలమంటూ ఓటు వేయాలని మతం పేరు చెప్పి ఇళ్లకు వెళతారని, మా దగ్గర మాత్రం అన్ని మతాల వారు పనిచేస్తున్నారన్నారు. ఇకజేఏసీ ఏర్పాటుచేసి ఏదో సాధించాలనుకుంటున్న ముస్లీం నేతలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ముస్లీంల సంక్షేమం, అభివృద్ధి కోసం ఏం కావాలో లెటర్‌లో రాసి తన దగ్గరకు తీసుకొస్తే ఆ లెటర్ పై సంతకం చేస్తానని చెప్పారు. తాము ఇతర నాయకుల మాదిరిగా డబ్బుల కోసం రాజకీయాల్లోకి రావడం లేదని, ప్రజలకు సేవ చేస్తూ కర్నూలును అభివృద్ధి చేసేందుకు రాజకీయాల్లోకి వస్తున్నామన్నారు. ప్రజలందరూ మతం కాదు.. మనిషిని చూడాలని ఆయన కోరారు.అనంతరం జనసేన అసెంబ్లీ ఇంచార్జి అర్షద్ మాట్లాడుతూ ముస్లీం మైనారిటీలు అందరూ విచక్షణతో ఆలోచించి సరైన నేతను ఎంచుకొని ఓటు వేయాలన్నారు. మనవాడని అందలం ఎక్కిస్తే మన జీవితాలను దుర్బరమైన పరిస్థితుల్లోకి నెట్టి వేశారని.. అలాంటి వ్యక్తులకు వ్యతిరేకంగా మైనారిటీలందరూ ఏకమై ఓడగొట్టాలన్నారు. రానున్న ఎన్నికల్లో టిడిపి జనసేన ఉమ్మడి అభ్యర్థి అయిన టి.జి భరత్ ను గెలిపించాలని అర్షద్ కోరారు.ఈ కార్యక్రమంలో మైనారిటీ కమిటీ నగర అధ్యక్షుడు హమీద్, టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వాహిద్, రాష్ట్ర మైనారిటీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మన్సూర్ ఆలీఖాన్, రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి బషీర్, పార్లమెంట్ మహిళా కమిటీ అధ్యక్షురాలు ముంతాజ్, తెలుగు యువత జిల్లా అధ్యక్షులు అబ్బాస్, మైనారిటీ సెల్ జిల్లా కార్యదర్శి ఇబ్రహీం, మైనారిటీ సెల్ నగర ప్రధాన కార్యదర్శి మెహబూబ్, నగర ఉపాధ్యక్షులు జుబేర్ ఆలీఖాన్, ఇమ్రాన్ సలీం, రజాక్, 11వ వార్డు ఇంచార్జి మెహబూబ్ ఖాన్, మైనారిటీ సెల్ కర్నూలు నగర ఆర్గనైజింగ్ సెక్రటరీ మహమ్మద్ గౌస్, సలీం ఖాన్, ఖాజా మొహిద్దీన్, మన్సూర్ ఆహ్మద్, అధికార ప్రతినిధి అబ్దుల్లా, రమీజ్ బాషా, కె.వి సుబ్బారెడ్డి, తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.