విద్యార్థులందరూ కనీస సామర్ధ్యాలు కలిగి ఉండాలి
1 min readలిప్ రాష్ట్ర పరిశీలకులు విజయకుమార్.
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి: పాఠశాలలో చదివే విద్యార్థులందరూ కనీస సామర్ధ్యాలు కలిగి ఉండాలని లిప్ (లర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం) రాష్ట్ర పరిశీలకులు విజయకుమార్ పేర్కొన్నారు. మంగళవారం రాయచోటి నియోజకవర్గం లోని సంబేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అమలవుతున్న అభ్యసనా అభివృద్ధి కార్యక్రమాన్ని ( లిప్) పరిశీలించారు. కోవిడ్ కారణంగా పాఠశాలలు చాలా రోజులుగా మూతపడి ఉండడంతో విద్యార్థుల సామర్థ్యాలపై ప్రతికూల ప్రభావం పడిందన్నారు. గత తరగతులలో నేర్చుకున్న అంశాలలో కూడా వెనకబడ్డారన్నారు. ఈ కారణం చేత ప్రభుత్వం విద్యార్థులలో కనీస విద్యా ప్రమాణాలు పెంపొందించడానికి లిప్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. అనంతరం లిప్ డిస్టిక్ రిసోర్స్ పర్సన్ వసంత మాట్లాడుతూ లిప్ కార్యక్రమం సమర్థవంతంగా అమలు చేయడానికి మొదట విద్యార్థుల సామర్ధ్యాలను అంచనా వేయాలన్నారు. ఇందుకోసం ప్రారంభ పరీక్ష,నెలవారి పరీక్షలు నిర్వహించాలన్నారు. ఈ పరీక్షలలో విద్యార్థులు చూపిన ప్రతిభ ఆధారంగా వారిని గ్రేడులుగా విభజించి వెనుకబడిన పిల్లలకు ప్రత్యేకంగా బోధించాలన్నారు. బోధనతో పాటు సాధనకు ప్రాధాన్యత ఉండాలన్నారు.మార్చి చివరినాటికి విద్యార్థులందరూ చదవడం, రాయడం, అంకగణితములందు సంపూర్ణ సామర్థ్యాలు సాధించే విధంగా ఉపాధ్యాయులు చొరవ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మడితాటి నరసింహారెడ్డి, డిస్టిక్ రిసోర్స్ పర్సన్ శంకరయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.