కూలీలంతా ఐక్యం కావాలి: వ్యవసాయ కార్మిక సంఘం
1 min readపల్లెవెలుగు, వెబ్ వెలుగోడు: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలను తిప్పి కొట్టి ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకోవాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి స్వాములు , జిల్లా నాయకులు నరసింహ నాయక్ , కెవిపిఎస్ జిల్లా నాయకులు రామదాసు పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో వెలుగోడు మండల వ్యవసాయ కార్మిక సంఘం మండల సమావేశం నరసింహ నాయక్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 25 వేల కోట్ల రూపాయలను బడ్జెట్లో నిధులను తగ్గించింది. ఉపాధి హామీ పథకంలో మార్పులు తీసుకువచ్చి ఉపాధి మేట్లకు పారితోషికం , కూలీలకు సమ్మర్ అలవెన్సులు, వాటర్ అలవెన్సులు , గడ్డపారలు సాన పెట్టుకొనుట కొరకు తట్టా ,బుట్ట , గంప తదితర సౌకర్యాలకు ఇస్తున్న అలవెన్స్లను తొలగించింది. ఉపాధి కూలీలకు కనీస వేతనం అమలు జరగడం లేదు. పెరిగిన ధరల కనుగుణంగా ఉపాధి కూలీలకు రోజు వేతనం 600 రూపాయలకు పెంచాలని , 200 రోజులు ప్రతి కుటుంబానికి పనులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈనెల 27, 28 తేదీలలో బేతంచెర్ల లో జరిగే వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం వెలుగోడు మండల కమిటీని ఎన్నుకోవడం జరిగింది. కన్వీనర్ గా నూరుల్లా , కో కన్వీనర్లుగా సరస్వతి లింగస్వామి ల తో పాటు ఏడు మంది కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది.