ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మొద్దు నిద్ర వీడాలి..
1 min read– ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ రాయలసీమ సాగునీటి హక్కుల పరిరక్షణకు మేల్కొనాలి
– రాయలసీమ నీటి హక్కుల పరిరక్షణకు రాజకీయ దౌత్యానికి పాలకులు సిద్దం కావాలి
– బొజ్జా దశరథరామిరెడ్డి.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాయలసీమ సాగునీటి హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ క్రియాశీలక కార్యాచరణ చేపట్టాలని కోరుతూ రాయలసీమ సాగునీటి సాధనా సమితి అధ్యక్షులు బొజ్జా దశరథ రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రధాన కార్యదర్శికి వ్రాసిన ఉత్తరాన్ని పత్రికలకు సోమవారం నాడు విడుదల చేసారు. ఈ సందర్భంగా రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ..అప్పర్ భద్ర ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తూ 5300 కోట్ల రూపాయల నిధులను ఫిబ్రవరి 1, 2023 ను కేంద్ర బడ్జెట్ లో అప్పటికప్పుడే ప్రకటించలేదని తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కర్నాటక రాష్ట్రం గత ఇరవై సంవత్సరాలుగా అనేక ప్రతిపాదనలను రూపొందిస్తునే కేంద్ర జలవనురుల అనుమతి కోసం ప్రయత్నిస్తునే ఉందని వివరించారు. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించేందుకు డిసెంబర్ 6, 2021 న నిర్వహించిన 13 వ హై పవర్డ్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొన్ని అభ్యంతరాలు లేవనెత్తిందని తెలిపారు. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులకు లోబడే కర్నాటక ప్రభుత్వం అప్పర్ భద్ర ప్రాజెక్టు చేపట్టారని కేంద్ర జలవనరుల శాఖ ఒక సమగ్ర నివేదికను జనవరి 14, 2022 న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంపిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్ర జలవనరుల శాఖ ఫిబ్రవరి 15, 2022 న నిర్వహించిన 14 వ హై పవర్డ్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలిపిన అభ్యంతరాలను తోసిపుచ్చిందని ఆయన తెలిపారు. బచావత్ ట్రిబ్యునల్ తీర్పుకు లోబడే ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇస్తున్నాం అని ఈ నివేదికలో పేర్కొంటూనే, ఇంకా న్యాయపరధిని దాటి నోటిఫై కావలసిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్, బచావత్ ట్రిబ్యునల్ కంటే ఇంకా లిబరల్ గా ఉంది అని ఈసమావేశ తీర్మానం లో పేర్కొన్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. అంటే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తుది నివేదిక యథాతథంగా నోటిపై అయితే అప్పర్ తుంగా, అప్పర్ భద్ర కు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయించిన 20 టి ఎం సీ ల నీటిని ఈ ప్రాజెక్టుకు అదనంగా వాడుకునే ప్రమాదం కూడా ఉందని దశరథరామిరెడ్డి హెచ్చరించారు. అప్పర్ భద్ర ప్రాజెక్టు అనుమతులకు సంబంధించిన అంశాలపై గత నాలుగు సంవత్సరాలుగా పైన పేర్కొన్న అనేక కీలకమైన నిర్ణయాలు జరుగుతున్నా, ఈ విషయాలపై రాజకీయ, న్యాయ పరమైన చర్యలు తీసుకొనడానికి, ఉన్న అవకాశాలను పాలకుల ముందుంచడంలో ఆంధ్రప్రదేశ్ సాగునీటి శాఖ విపలమైందన్న భావన రాయలసీమ సమాజంలో ఉందని ఆయన తెలిపారు. అప్పర్ భద్రతకు జాతీయ హోదా కల్పించడంపై వివరాలు అందాల్సి ఉందని రాష్ట్ర ఆర్థిక శాఖ, రెండు తెలుగు రాష్ట్రలకు సంబంధించిన కృష్ణా నది యాజమాన్య బోర్డు విధివిధానాలకు, బచావత్ కేటాయింపులకు లోబడి ఉందా తెలుసుకోవాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి ప్రకటించడం రాష్ట్ర జలవనురుల శాఖ పనితీరుకు అద్దం పట్తున్నదని దశరథరామిరెడ్డి విమర్శించారు. తుంగభద్ర నది ఎగువన సాగునీటి కేటాయింపులు లేకుండా నిర్మాణాలు చేపడితే రాయలసీమకు తీవ్ర నష్టం జరుగుతుందన్నది నిర్వివాదాంశం అని బొజ్జా పేర్కొన్నారు. ఇదే సందర్భంలో రాయలసీమ ప్రాజెక్టులకు చట్టబద్ద నీటి హక్కులను పరిరక్షించేందుకు చేపట్టాల్సిన నిర్మాణాలు మరియు వ్యవస్థల ఏర్పాటు పట్ల ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సి ఉందన్న విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. ఇందులో కూడా ప్రభుత్వం విపలమైనట్లుగా రాయలసీమ సమాజం భావిస్తున్నదని, ఈ భావనకు రాష్ట్ర ప్రజలు రావడానికి రెండు ఉదాహరణలను వివరించారు. రాయలసీమకు చట్టబద్ద నీటి హక్కులున్న కె సి కెనాల్, తుంగభద్ర దిగువ కాలువ, తెలంగాణలోని ఆర్ డి ఎస్ ప్రాజెక్టులకు సక్రమంగా తుంగభద్ర నది నుండి నీటిని పొందడానికి వీలుగా రాయలసీమ సాగునీటి సాధన సమితి చేసిన కృషితో గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సమగ్ర ప్రాజెక్టు నివేదికకు 2012 వ సంవత్సరంలో అనుమతులు లభించిన విషయాన్ని దశరథరామిరెడ్డి గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ రాష్ట్రంను ఒప్పించి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని GO RT No.154 Dt 21.2. 2019 వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉద్యమాలు చేసినా, ప్రజా ప్రతినిధులు ఉత్తరాలు వ్రాసినా, సాగునీటి సలహా మండలి సమావేశాలలో తీర్మానాలు చేసినా, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ అలక్ష్యంతో ఈ ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా తయారైందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. సహజ న్యాయ సూత్రాలను అనుసరించి కృష్ణా నది యాజమాన్య బోర్డును కృష్ణా జలాల నిర్వహణకు మరియు పంపిణీకి కీలకమైన శ్రీశైలం రిజర్వాయర్ ఉన్న కర్నూలులో ఏర్పాటు చేయాల్సిందని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం అనుమతించిన తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీనీవా, వెలిగొండ ప్రాజెక్టులను , ముచ్చుమర్రి, గురు రాఘవేంద్ర, సిద్దాపురం ఎత్తిపోతల పథకాలకు మరియు చట్టబద్దత కలిగిన రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించిన నీటిని సంపూర్ణంగా వినియోగించుకొనడానికి కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయంను కర్నూలు లో ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని సవివరంగా వివరించారు. కాని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ఆ దిశగా అడుగులు వేయకుండా కృష్ణా నది తో ఏమాత్రం సంబంధం లేని విశాఖపట్నం లో కృష్ణా నది యాజమాన్య బోర్డు ఏర్పాటుకు మొగ్గు చూపడం రాయలసీమ వాసులను ఆశ్చర్యానికి గురిచేసిందని పేర్కొన్నారు. వై ఎస్ ఆర్ సి పార్టీ విధానం ప్రకారం న్యాయ రాజధానిని కర్నూలులో ఏర్పాటు చేస్తామని ప్రకటించినప్పటికి, కృష్ణా నది జలాల వివాదాల పరిష్కారానికి సంబంధించిన న్యాయ రాజధానిలో భాగమైన కృష్ణా నది యాజమన్య బోర్డ్ కర్నూలులో ఏర్పాటుకు జలవనరుల శాఖ స్పందించకపోవడంతో ప్రభుత్వంపై రాయలసీమ ప్రజల విశ్వసనీయత ప్రశ్నార్ధకంగా మారిందని ఆయన తెలిపారు. కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయం కర్నూలులో ఏర్పాటు చేయాలని గత రెండు సంవత్సరాలుగా రాయలసీమ సాగునీటి సాధన సమితి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నా, అనేక మంది ప్రజాప్రతినిధులు ఉత్తరాలు వ్రాసినా, జలవనరుల శాఖ మొద్దు నిద్రలోనే ఉందని విమర్శించారు. రాయలసీమ సాగునీటి హక్కుల పరిరక్షణకు కీలకమైన అంశాలు పట్ల ఇప్పటికైన ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ క్రియాశీలకంగా స్పందించి రాజకీయ, న్యాయ పోరాటాలకు ప్రభుత్వానికి ఆయుధాలను అందించే దిశగా కార్యాచరణ చేపట్తుందని ఆశాభావాన్ని వ్యక్తపరిచారు.