సరికొత్త డయాబెటిస్ పరికరాన్ని ఆవిష్కరించిన ఆంధ్రా యూనివర్శిటీ !
1 min readపల్లెవెలుగువెబ్: విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ పరిశోధకులు సరికొత్త పరికరాన్ని ఆవిష్కరించారు. దీని సాయంతో టైప్-2 డయాబెటిస్ ను చిటికెలో తెలుసుకోవచ్చు. పైగా ఈ పరికరం అత్యంత చవకైనది. ఈ పోర్టబుల్ నానో బయోసెన్సార్ పరికరాన్ని ఆంధ్రా యూనివర్సిటీ బయో కెమిస్ట్రీ విభాగం రూపొందించింది. ప్రొఫెసర్ పూసర్ల అపరంజి నేతృత్వంలో ఈ పరికరాన్ని అభివృద్ధి చేశారు. ఇది చూడ్డానికి ఓ పెన్ డ్రైవ్ లా కనిపిస్తుంది. ఇందులో వినియోగించే టెస్టింగ్ స్ట్రిప్ లను బయో ఫ్యాబ్రికేషన్ తో తయారుచేశారు. తద్వారా వీటిని 6 నెలల పాటు ఎన్నిసార్లయినా వాడుకోవచ్చు. ఒక్క రక్తపు చుక్కతో సెకను వ్యవధిలో ఫలితాలు వెల్లడవుతాయి. అంతేకాదు, ఈ పరికరాన్ని ఫోన్ లేదా ల్యాప్ టాప్ కు అనుసంధానం చేసుకోవచ్చు. అప్పుడు షుగర్ టెస్టు వివరాలు స్క్రీన్ పై కనిపిస్తాయి. కాగా, ఈ షుగర్ టెస్టు పరికరం టెక్నాలజీపై ఆంధ్రా యూనివర్సిటీ పేటెంట్ కూడా పొందింది. అంతేకాదు, దీన్ని వాణిజ్య ప్రాతిపదికన ఉత్పత్తి చేసేందుకు విశాఖకు చెందిన ఓ ప్రైవేటు సంస్థతో వర్సిటీ ఒప్పందం కుదుర్చుకుంది.