PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గర్భిణీలకు పోషణ అందేలా అంగన్వాడీలు చర్యలు తీసుకోవాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:   గర్భిణీ స్త్రీలు, పిల్లలు సరైన పోషకాహారం తీసుకునేలా అంగన్వాడీ కేంద్రాల ద్వారా సంపూర్ణ అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు.బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి “పోషణ్ మాసోత్సవం” (పోషన్ మా) కార్యక్రమంలో  కలెక్టర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీ వ్యవస్థ ద్వారా   గర్భిణీ స్త్రీలు,  బాలింతలు, పిల్లలకు  సంపూర్ణ పోషణ అందజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వీరికి ఏ విధమైన ఆహారం ఇస్తే  సంపూర్ణ పోషణ అందుతుంది అన్న విషయాలను కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో ప్రతి 15 రోజులకు ఒకసారి మిల్లెట్ ఆధారిత వంటకాన్ని చేసి తల్లులకు చూపించాలని, అదే వంటకాన్ని పిల్లలకు పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ఐసిడిఎస్ ఇంఛార్జి పిడికి కలెక్టర్ సూచించారు. అదే విధంగా టేక్ హోమ్ రేషన్ ద్వారా ఇస్తున్న పదార్ధాలతో రుచికరమైన మంచి వంటకాలను ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అని అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.. టేక్ హోమ్ రేషన్ ద్వారా ఇచ్చే పదార్థాలను ఇతర కుటుంబ సభ్యులు కాకుండా గర్భిణీ స్త్రీలు మాత్రమే వాడే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. టేక్ హోమ్ రేషన్,  పాలు, గుడ్లు, బాలామృతంకు సంబంధించి అంగన్వాడీ కేంద్రాలలో  రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన లో భాగంగా ఎత్తుకు, వయసుకు తగ్గ బరువు,రక్తహీనత అంశాలలో పురోగతి సాధించాలని కలెక్టర్ సూచించారు. అంగన్వాడీ కేంద్రాలలో పరిశుభ్రత పాటించాలన్నారు.. ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ లో సూచించిన ప్రక్రియలను కచ్చితంగా పిల్లలతో చేయించాలన్నారు.విద్యార్థుల బోధనకు అవసరమైతే శిక్షణ తరగతులు కూడా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఐసిడిఎస్ పిడికి సూచించారు. అంగన్వాడీ సిబ్బంది పిల్లలను ప్రేమతో, గౌరవంగానూ చూడాలన్నారు .. ఇప్పటి వరకు 99 శాతం టిహెచ్ఆర్ గర్భిణీ స్త్రీలకు అందజేయడం జరిగిందని,  వాటి ద్వారా వారు రక్తహీనత నుంచి బయటపడ్డారా లేదా అని  పరిశీలించాలని ఐసిడిఎస్ ఇంఛార్జి పిడిని కలెక్టర్ ఆదేశిస్తూ, డిఎంహెచ్ఓ కూడా పరీక్షలు నిర్వహించేలా ఆదేశాలు ఇస్తామన్నారు. అదే విధంగా  రక్తహీనత నుంచి బయటపడిన వారి వివరాలను డాక్యుమెంట్ రూపంలో తయారు చేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో ఉన్న ఫర్నీచర్ ను పూర్తి స్థాయిలో వినియోగించు కోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో అవసరమైన ఫ్యాన్స్, లైట్ల వివరాలు అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు..బాల్య వివాహాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఒకవేళ మీ పరిధిలో ఏమైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లయితే వాటిని నియంత్రించడంతోపాటు జిల్లా స్థాయి అధికారులకు కూడా సమాచారాన్ని అందజేయాలన్నారు. జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య మాట్లాడుతూ పోషణ లోపం, రక్తహీనత ఉన్న వారికి పోషణ అందజేయడంకోసం  ప్రత్యేకంగా ఒక సంవత్సరంలో ఒక నెలను గుర్తించి  పోషణ అభియాన్ అవగాహన కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు.  గర్భిణీ స్త్రీలకు ఇచ్చే టేక్ హోమ్ రేషన్ లో పోషకాలు ఉన్న రాగి, అటుకులు, బెల్లం, డేట్స్ ఉంటాయని, వాటిని వారే ఉపయోగించుకునేలా చూడాలన్నారు..రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న టేక్ హోమ్ రేషన్ కిట్ ను తప్పనిసరిగా తల్లులు తీసుకోవడం వల్ల రక్తహీనత తగ్గడంతో పాటు పిల్లలలో పోషకాహార లోపం తగ్గి తక్కువ బరువు, ఎదుగుదల లోపం లేకుండా ఉంటారన్నారు. రక్త హీనత ఉన్న గర్భిణీ స్త్రీలు, తల్లులు, పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించి వారికి పోషణ అందేలా అంగన్వాడీ సిబ్బంది అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్ సూచించారు.అనంతరం జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు చిరుధాన్యాలతో తయారు చేసిన పోషకాహార ప్రదర్శన ను తిలకించారు.. ఇలాగే క్షేత్ర స్థాయిలోనూ నిర్వహించాలని వారు సూచించారు.కార్యక్రమంలో ఇంచార్జి ఐసిడిఎస్ పిడి వెంకట లక్ష్మమ్మ, సిడిపిఓలు, సూపర్వైజర్లు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

About Author