కేజ్రీవాల్ పై అన్నా హజారే ఆగ్రహం
1 min readపల్లెవెలుగువెబ్ : అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారే కేజ్రీవాల్ పై తీవ్రంగా మండిపడ్డారు. ఆప్ పార్టీ కూడా ఇప్పుడు అన్నింట్లో ఒకటిగా మారిపోయిందని.. అధికారం నిషా ఎక్కిందని విమర్శించారు. నాడు అవినీతి వ్యతిరేక పోరాటంలో ఎత్తుకున్న ఆదర్శాలను గాలికి వదిలేశారని పేర్కొన్నారు. ఈ మేరకు కేజ్రీవాల్ కు ఒక లేఖ రాశారు. ‘‘మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సారిగా లేఖ రాస్తున్నాను. ఎందుకంటే.. మీ ప్రభుత్వం ఇటీవల తెచ్చిన లిక్కర్ పాలసీ విషయంలో వచ్చిన వార్తలు నన్ను భాధించాయి. నాడు అవినీతి వ్యతిరేక పోరాటంలో రాసిన ‘స్వరాజ్’ పుస్తకంలో ఎక్కడైనా స్థానికుల అనుమతి లేకుండా లిక్కర్ దుకాణాలు పెట్టవద్దని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అయ్యాక అవన్నీ మర్చిపోయినట్టున్నారు. లిక్కర్ లాగే అధికారం కూడా నిషా ఇస్తుంది. మీకు ఆ అధికారం నిషా తలకు ఎక్కినట్టు కనిపిస్తోంది. మీరు స్థాపించిన ఆమ్ ఆద్మీ పార్టీ.. మిగతా అన్ని పార్టీల్లాగే మారిపోయింది..” అని హజారే వ్యాఖ్యానించారు.