PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భారత్‌లో మరో కొత్త వ్యాధి..

1 min read

– బ్లాక్ ఫంగస్ తర్వాత.. ఇప్పుడు వైట్ ఫంగస్

పల్లెవెలుగు వెబ్​: కరోనా నుంచి ఇంకా కోలుకోక ముందే.. బ్లాక్ ఫంగస్ టెన్షన్ పెడుతోంది. అంతటా కేసులు నమోదవుతున్నాయి. పలువురు చనిపోతున్నారు. ఐతే బ్లాక్ ఫంగస్ గురించి ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకుంటున్న క్రమంలోనే.. మరో కొత్త వ్యాధి వచ్చింది. అదే వైట్ ఫంగస్. బిహార్‌లోని పాట్నా మెడికల్ కాలేజీలో నాలుగు వైట్ ఫంగస్ కేసులు నమోదయినట్లు పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో మైక్రో బయాలజీ హెడ్ డాక్టర్ SN సింగ్ తెలిపారు. కరోనా మాదిరే.. వైట్ ఫంగస్ కూడా ఊపిరితిత్తులను దెబ్బతిస్తుందని చెప్పారు. సరైన సమయంలో చికిత్స తీసుకోకుంటే ఊపిరితిత్తుల నుంచి గోళ్లు, చర్మం, కడుపు, మూత్రపిండాలు, మెదడు, మర్మాంగాలు, నోటికి వ్యాపించే ప్రమాదముందని హెచ్చరించారు.
– కరోనా లక్షణాలతో ఉన్న నలుగురు వ్యక్తులకు పరీక్షలు చేయగా ఫలితాల్లో నెగెటివ్ వచ్చింది. కానీ వారిలో మాత్రం కరోనా లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. మరోసారి HRCT పరీక్ష చేశారు. ఐనప్పటికీ కరోనా నెగెటివ్ వచ్చింది. ఈసారి మ్యూకస్ కల్చర్‌ను పరీక్షించగా వైట్ ఫంగస్ బయటపడింది. ఊపిరితితుల్లో వైట్ ఫంగస్ ఉన్నట్లు తేలడంతో వెంటనే యాంటి ఫంగల్ డ్రగ్స్ ఇచ్చారు. అనంతరం వారు కోలుకుంటున్నారని ఎన్‌సింగ్ తెలిపారు. ప్రారంభ దశలో గుర్తిస్తే ప్రమాదమేమీ లేదని.. కానీ ఆలస్యంగా గుర్తిస్తే మాత్రం ప్రాణాలకే ప్రమాదమని చెప్పారు. బ్లాక్ ఫంగస్ వ్యాధి కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో కనిపిస్తోందని.. కానీ వైట్ ఫంగస్ మాత్రం కరోనా లక్షణాలున్న వారిలో బయటపడుతోందని పేర్కొన్నారు.
– ఇది బ్లాక్ ఫంగస్ కన్నా ప్రమాదకరమని పేర్కొన్నారు. కరోనా లక్షణాలు ఎక్కువగా కనిపించి.. కరోనా నెగెటివ్ వస్తే మాత్రం.. ఖచ్చితంగా మ్యూకస్ కల్చర్ పరీక్ష చేయించాలని వైద్యులు సూచించారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారితో పాటు డయాబెటిస్ రోగులు, చాలా కాలంగా స్టెరాయిడ్స్ తీసుకుంటున్న వారు ఎక్కువగా వైట్ ఫంగస్ బారినపడే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు బిహార్‌లో బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు మరణించారు. అంతలోనే వైట్ ఫంగస్ కేసులు వెలుగు చూడడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.

About Author