ఇకనైనా.. మారండి..!
1 min read– సీఎం జగన్కు సూచించిన కర్నూలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సోమిశెట్టి
పల్లెవెలుగు వెబ్, కర్నూలు : రాజకీయ కక్ష సాధింపు చర్యలు మానుకొని.. బాధ్యతాయుతంగా సీఎం హోదాలో ఆలోచించి.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని టీడీపీ కర్నూలు , నంద్యాల పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, గౌరు వెంకట రెడ్డి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సూచించారు. ప్రతిపక్షాలపై అనవసరంగా కేసులు బనాయించి… అరెస్టు చేయించడం దినచర్యగా మార్చుకున్నారని, ఇది మంచి పద్దతి కాదని హితవు పలికారు. సోమవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కర్నూలు జిల్లా బనగానపల్లె మాజీ యం.యల్.ఎ. బి.సి. జనార్దన్ రెడ్డి ఇంటి చుట్టూ వైసీపీ కార్యకర్తలు మారణాయుధాలతో తిరిగారని, దీన్ని పసిగట్టిన కొందరు తమపై దాడి చేయడానికా.. లేక బీసీ జనార్దన్ రెడ్డిని హత్య చేయడానికి వచ్చారా.. అని నిలదీశారు. దీంతో వైసీపీ కార్యకర్తలు బీసీ జనార్ధన్ రెడ్డి అనుచరులపై దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. గొడవ జరుగుతున్న విషయం తెలుసుకున్న బీసీ జనార్ధన్ రెడ్డి సర్దిచెప్పేందుకు ప్రయతించగా.. పోలీసులు జనార్ధన్ రెడ్డినే వైసీపీ కార్యకర్తలపై దాడి చేయించారని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారని, ఇదేమి న్యాయమని ప్రశ్నించారు. శాంతి భద్రతల విషయంలో ఎస్పీ నిష్పక్షపాతంగా ఉన్నారని, కానీ క్షేత్రస్థాయిలో ఏకపక్షంగా వ్యవహరించడం సమంజసం కాదన్నారు. ప్రస్తుతం జిల్లా ప్రశాంతంగా ఉందని, కానీ బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇలాంటి గొడవలను ప్రోత్సహించడం మంచి పద్దతి కాదన్నారు. కరోన కష్టకాలంలో ప్రజలకు సేవలందించి మంచి సీఎంగా పేరు తెచ్చుకోవాలని, రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఇకనైనా మార్చుకోండని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టీడీపీ కర్నూలు, నంద్యాల పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, గౌరు వెంకట రెడ్డి సూచించారు.