మధ్యంతర భృతి 30 శాతం తక్షణమే ప్రకటించాలి.. ఏపీ జేఏసీ
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: పిఆర్సీ నివేదిక ఆలస్యమవుతున్నందున ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక , పెన్షనర్లకు ప్రస్తుత ధరలను బట్టి 30 శాతము మధ్యంతర భృతి (ఐ. ఆర్) తక్షణమే ప్రకటించి, అమలు చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఏపీ జేఏసీ నాయకులు నగిరి. శ్రీనివాసులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం గడివేముల మండలంలోని గడిగరేవుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఏపీ జేఏసీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న డి. ఏ.లను విడుదల చేయాలని అలాగే డి.ఎ. మరియు పిఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎస్, జిపిఎస్ లను రద్దుచేసి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని , కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు 57 ప్రకారం 2004 సెప్టెంబర్ 1 వ తేదీ కంటే ముందే నియామకమై ఆ తర్వాత ఉద్యోగంలో చేరిన వారికి పాత పెన్షన్ విధానాన్ని వర్తింపచేయాలని కోరారు. అలాగే ఉపాధ్యాయ నియామకాలలో అప్రెంటీస్ విధానమును ప్రవేశపెట్టడం దుర్మార్గమైన విధానమని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం దీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న 20 వేల కోట్ల రూపాయలు ఆర్థిక బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఏపీ జేఏసీ కార్యాచరణలో భాగంగా ఈనెల 17వ తేదీన తాలూకా స్థాయిలో, 20 తేదీన జిల్లాస్థాయిలో జరిగే ర్యాలీలు, నిరసన కార్యక్రమాలలో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జె. రాజేంద్రప్రసాద్, ఏపీటీఎఫ్ గడివేముల మండల శాఖ అధ్యక్షులు ఎల్. బాలస్వామి, జిల్లా కౌన్సిలర్ ఎం. ప్రతాపరెడ్డి జిల్లా మహిళా ప్రతినిధి యు. కవిత , లక్ష్మీదేవి, బి.రాంపుల్లారెడ్డి, మారెన్న, శ్రీరాములు, చంద్రావతి, కోమలమ్మ , పుష్పకుమారి, ఆదిశేషమ్మ తదితరులు పాల్గొన్నారు.