NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అగ్నిప‌థ్ ఆందోళ‌న‌ల్లో ఏపీ మూలాలు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అగ్నిపథ్‌ వ్యతిరేక ఆందోళనల్లో ఏపీ మూలాలు బయటపడ్డాయి. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో శుక్రవారం బద్దలయిన తీవ్రహింస వెనుక పల్నాడు జిల్లా నరసరావుపేట ప్రాంతానికి చెందిన వ్యక్తి ప్రమేయం ఉన్నట్టు తెలంగాణ పోలీసులు గుర్తించినట్టు సమాచారం. ఆ వెంటనే రాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేశారు. ఈ వ్యవహారంలో నరసరావుపేటలోని సాయి డిఫెన్స్‌ అకాడమీ సహా తొమ్మిది అకాడమీలను నిర్వహిస్తున్న ఆవుల సుబ్బారావు అనే వ్యక్తిని తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్‌ హింసకు పాల్పడిన వ్యక్తుల మొబైల్‌ వాట్సాప్‌ గ్రూప్‌ స్ర్కీన్‌ చాట్‌ను ఏపీ పోలీసు ఉన్నతాధికారులతో తెలంగాణ పోలీసులు పంచుకున్నారు.హకింపేట్‌ ఆర్మీ సోల్జర్స్‌ పేరుతో ఉన్న ఈ వాట్సాప్‌ గ్రూపులో ఆవుల సుబ్బారావు ప్రస్తావన ఉంది. ‘సాయి డిఫెన్స్‌ డైరెక్టర్‌ ఆవుల సుబ్బారావు హైదరాబాద్‌కు చేరుకున్నారు.. రేపు(17) జరిగే నిరసన ర్యాలీకి మద్దతు తెలపనున్నారు.. మిగతా డైరెక్టర్లు కూడా మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం’ అంటూ మహిర అనే పేరుతో గురువారం రాత్రి 11గంటల ప్రాంతంలో ఓ నోట్‌ పోస్ట్‌ అయింది. ఈ నోట్‌ను పరిశీలించిన నరసరావుపేట పోలీసులు సుబ్బారావును ఆయన ఇంట్లో అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 12 గంటల పాటు పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో విచారించిన అనంతరం తెలంగాణ పోలీసులకు అప్పగించారు. రైల్వే పోలీసులు సుబ్బారావును రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్టు సమాచారం.

                                            

About Author