వైవీయూ కు ఏపీపీజీసెట్ నిర్వహణ బాధ్యతలు
1 min readపల్లెవెలుగు వెబ్, కడప బ్యూరో : ఆంధ్ర ప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ( ఎ.పి.పి.జి.సి.ఇ.టి) -2021నిర్వహణ బాధ్యతలను కడప యోగి వేమన విశ్వవిద్యాలయానికి అప్పగిస్తూ రాష్ట్ర ఉన్నత విద్య అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులకు సౌకర్యవంతంగా రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ప్రవేశానికి ఒకే పరీక్ష వంటి విప్లవాత్మకమైన నిర్ణయాన్ని తీసుకుని ఈ విద్యాసంవత్సరం అమలు చేస్తోంది రాష్ట్ర ఉన్నత విద్య మండలి. రాష్ట్రంలో 13 విశ్వవిద్యాలయాల్లో ఉన్న ఎమ్.ఎ., ఎంకాం., ఎం.ఎస్.సి., ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ, పోస్టు గ్రాడ్యుయేషన్ డిప్లమా వంటి 127 కోర్సుల్లో ప్రవేశానికి కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ను నిర్వహించేందుకు విధివిధానాలు విడదల చేసింది.
రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయాల్లోని పోస్ట్ గ్రాడ్యుయేషన్ కళాశాలలో అనుబంధ పీజీ కళాశాలలు, ప్రైవేట్, అన్ఎయిడెడ్, మైనారిటీ కళాశాలల్లో 2021 -22 విద్యా సంవత్సరంలో పీజీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి పీజీ సెట్ నిర్వహిస్తోంది. డిగ్రీ ఉత్తీర్ణులైన విద్యార్థులు, చివరి సెమిస్టర్ పరీక్షలు రాసిన వారు దరఖాస్తునకు అర్హులని పేర్కొన్నారు. దరఖాస్తుల స్వీకరణ, పరీక్షల తేదీ వివరాలతో త్వరలోనే షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ఏపీ పీజీ సెట్ నిర్వహణ కమిటీ చైర్ పర్సన్ గా యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య మునగాల సూర్య కళావతి వ్యవహరించనున్నారు. ఇందులో ఎస్వీయూ ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ నుంచి వైస్ ఛాన్సలర్లు, రాష్ట్ర ఉన్నత విద్య స్పెషల్ చీఫ్ సెక్రటరీ , కళాశాల విద్య కమీషనర్ కార్యలయం వారు సభ్యులు గా ఉంటారు.
ఏపీ పీజీ సెట్ కన్వీనర్ గా ఆచార్య వై.నజీర్ అహ్మద్
ఆంధ్ర ప్రదేశ్ గ్రాడ్యుయేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ -2021 కన్వీనర్ గా యోగి వేమన విశ్వవిద్యాలయం భౌతికశాస్త్ర శాఖ ఆచార్యులు వై. నజీర్ అహ్మద్ ను నియమిస్తూ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆచార్య నజీర్ అహ్మద్ గతంలో రాష్ట్రస్థాయి ప్రవేశ పరీక్షలకు కన్వీనర్ గా వ్యవహరించిన అనుభవం ఉంది. ఆచార్య నజీర్ అహ్మద్ నిర్వహణలో 2021-22 విద్యాసంవత్సరం ప్రవేశ పరీక్ష, కౌన్సిలింగ్ ద్వారా ప్రవేశాలు జరగనున్నాయి.
ఇది వై వి యు కు దక్కిన గౌరవం: ఉపకులపతి ఆచార్య సూర్య కళావతి
రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు ఒకే పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పించాలని నిర్ణయం తీసుకోవడం, నిర్వహణ బాధ్యతలను తమ విద్యాలయానికి అప్పగించడం పట్ల ఉపకులపతి ఆచార్య సూర్యకళావతి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ మాత్యులు ఆదిమూలపు సురేష్, ఉన్నత విద్య రాష్ట్ర ఉన్నతాధికారులు ఏపీ పిజి సెట్ నిర్వహణ బాధ్యతను వైవీయూకు అప్పగించడం పట్ల వారికి ఉపకులపతి ధన్యవాదాలు తెలిపారు. ఇది యోగి వేమన విశ్వవిద్యాలయం కి దక్కిన గౌరవంగా భావిస్తామన్నారు. మా విశ్వవిద్యాలయం పై ఉన్న నమ్మకాన్ని, విశ్వసనీయతను నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు.