PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మెద‌డు శ‌స్త్రచికిత్సల్లో ఏఆర్, ఏఐ విప్లవం: కిమ్స్ ఆస్పత్రి

1 min read

కొత్త ప‌రిక‌రం సాయంతో శ‌స్త్రచికిత్సలు

ఇప్పటికే 16 మందికి చేసిన కిమ్స్ న్యూరోస‌ర్జన్ డాక్టర్ మాన‌స్ పాణిగ్రాహి

3-డి రూపంలో క‌ణితుల గుట్టు తేల్చేస్తుంది

ఇక న్యూరో నేవిగేష‌న్‌ అవ‌స‌రం త‌గ్గిన‌ట్లే

పల్లెవెలుగు వెబ్  హైద‌రాబాద్‌ : మెద‌డులో క‌ణితులు ఏర్పడిన‌ప్పుడు శ‌స్త్రచికిత్సలు చేయాలంటే చాలా ప్రక్రియ ఉంటుంది. ముందుగా ఎంఆర్ఐ, సీటీ  స్కాన్లు తీసుకుని వాటిని విశ్లేషించి, ఆ త‌ర్వాత మార్కింగ్ చేసుకుని, న్యూరో నేవిగేష‌న్ సాయంతో అత్యంత జాగ్రత్తగా ఆప‌రేష‌న్ చేయాలి. ఇంత చేసినా, ఒక్కోసారి మాన‌వ త‌ప్పిదాలు జ‌రుగుతుంటాయి. దివంగ‌త న‌టి శ్రీ‌దేవి త‌ల్లికి అమెరికాలో ఆప‌రేష‌న్ చేయించినప్పుడు ఎడ‌మ‌వైపు చేయాల్సిన‌ది కుడివైపు చేసిన ఘ‌ట‌న గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ స‌మ‌స్యల‌న్నింటినీ అధిగ‌మించ‌డానికి ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త సాంకేతిక ప‌రిజ్ఞానం ఉప‌యోగ‌ప‌డుతోంది. ఆగ్మెంటెడ్ రియాలిటీ, ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ రెండింటినీ క‌ల‌గ‌లిపి రూపొందించిన ఓ స‌రికొత్త ప‌రిక‌రం మెద‌డు, ఇత‌ర శ‌స్త్రచికిత్సల్లో స‌రికొత్త విప్ల‌వానికి నాంది పలికింది. ఈ ప‌రిక‌రం సాయంతో సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి చెందిన ప్రముఖ న్యూరోస‌ర్జన్, న్యూరో స‌ర్జరీ విభాగాధిప‌తి డాక్టర్ మాన‌స్ పాణిగ్రాహి ఇప్పటికి 16 మంది రోగుల‌కు శ‌స్త్రచికిత్సలు చేశారు. ఇది అత్యంత ఉప‌యుక్తంగా ఉంటోంద‌ని ఆయ‌న తెలిపారు. ఈ స‌రికొత్త ప‌రిక‌రం గురించి, అది ఎలా ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్న విషయాల గురించి ఆయ‌న వివ‌రించారు. “స్కియా అనే కంపెనీ నుంచి వ‌చ్చిన ఈ స‌రికొత్త స్కానింగ్ ప‌రిక‌రం మెద‌డు శ‌స్త్రచికిత్సల్లో చాలా ఉప‌యోపడుతుంది. ఇంత‌కుముందు అయితే రోగి ఏదైనా స‌మ‌స్యతో వ‌చ్చిన‌ప్పుడు కిమ్స్ ఆస్పత్రిలో మేము ముందుగా సీటీ స్కాన్, ఎంఆర్ఐ తీసి, వాటి ద్వారా లోప‌ల క‌ణితులు ఎక్కడ ఉన్నాయో గుర్తించేవాళ్లం. ఆ త‌ర్వాత మార్కింగ్ చేసుకుని, ఆప‌రేష‌న్ థియేట‌ర్‌లో న్యూరో నేవిగేష‌న్ ప‌రిక‌రం సాయంతో శ‌స్త్రచికిత్స చేసేవాళ్లం. అయితే, ఇందుకు మ‌త్తు మందు కొంత ఎక్కువ ఇవ్వాల్సి వ‌స్తుంది. న్యూరో నేవిగేష‌న్ ప‌రిక‌రం ఖ‌రీదు కూడా బాగా ఎక్కువ‌. దీనివ‌ల్ల రోగికి ఖ‌ర్చు కూడా పెరుగుతుంది. కానీ ఇప్పుడు ఆగ్మెంటెడ్‌ రియాలిటీ, ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ క‌ల‌గ‌లిసిన ఈ కొత్త ప‌రిక‌రం వ‌ల్ల చాలా సౌల‌భ్యం ఉంటోంది. ఇది చూసేందుకు ఒక పెద్ద సైజు ట్యాబ్ ప‌రిమాణంలో ఉంటుంది. దీన్నుంచి వెలువ‌డే లేజ‌ర్ కిర‌ణాలు రోగికి ఎలాంటి హాని చెయ్యవు. ముందుగా సీటీ స్కాన్ తీసుకుని, దాన్ని దీనికి పంపిన త‌ర్వాత ఈ ప‌రిక‌రంతో రోగి మెద‌డును పైనుంచి ఫొటోలు తీసిన‌ట్లుగా స్కాన్ చేస్తారు. అప్పుడు ఆ ప‌రిక‌రం సీటీ స్కాన్‌లోని వివ‌రాల‌తో రోగి మెద‌డు లోప‌లి వివ‌రాల‌ను పోల్చిచూసి, దాన్ని బ‌ట్టి రోగి మెద‌డు లోప‌లి భాగాలు అన్నింటినీ 3-డి రూపంలో స్పష్టంగా చూపిస్తుంది. దానివ‌ల్ల క‌ణితి ఏ రూపంలో ఉంది, ఎంత ప‌రిమాణంలో ఉంది, ఎంత లోతులో, ఎంత దూరంలో ఉంద‌న్న వివ‌రాల‌న్నీ స్పష్టంగా క‌నిపిస్తాయి. వీటిని కేవ‌లం వైద్యులు అర్థం చేసుకోవ‌డ‌మే కాదు… రోగులు, వాళ్ల బంధువులు కూడా సుల‌భంగా చూడొచ్చు. అందులో ర‌క్తనాళాలు, క‌ణితి ఆకారం అన్నీ క‌నిపిస్తాయి. ఇందులో ముందుగా రోగి శ‌రీరాన్ని, అందులోని భాగాల‌ను స్కాన్ చేసి, 3-డిలో ఒక డిజిట‌ల్ కాపీని అది సిద్ధం చేస్తుంది. దీన్నే డిజిట‌ల్ ట్విన్ అంటారు. ఆ త‌ర్వాత ఇందులోని ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ఈ డిజిట‌ల్ ట్విన్‌ను విశ్లేషిస్తుంది. అప్పటికే తీసిన సీటీ స్కాన్‌ను, దీన్నుంచి వ‌చ్చిన 3డి స‌మాచారాన్ని పోల్చుకుని, 3డి మెడిక‌ల్ ఇమేజిల‌ను సిద్ధం చేస్తుంది. ఇందులో మ‌న శ‌రీరంలోని ఎముక‌లు, ర‌క్తనాళాలు, క‌ణితులు అన్నింటినీ అత్యంత స్పష్టంగా చూపిస్తుంది. ఇందుకోసం స్కియా ప‌రిక‌రం మ‌నిషి శ‌రీరం మీద కొన్ని ల‌క్షల సంఖ్యలో లేజ‌ర్లను పంపుతుంది. వాటి వ‌ల్ల ఎలాంటి ప్రమాదం ఉండ‌దు. పైపెచ్చు, రేడియేష‌న్ ముప్పు నుంచి కూడా రోగుల‌కు విముక్తి ల‌భిస్తుంది. ప్రపంచంలోనే ఇది మొట్టమొద‌టి మార్కర్‌లెస్ ఆగ్మెంటెడ్ రియాలిటీ. ప్రపంచ‌వ్యాప్తంగా ప‌లుర‌కాల కేసుల‌కు సంబంధించిన వంద‌ల మంది రోగుల‌కు దీనిసాయంతో శ‌స్త్రచికిత్సలు చేశారు. అత్యాధునిక శ‌స్త్రచికిత్సల‌కు పేరొందిన కిమ్స్ ఆస్పత్రిలో ఇప్పటికే ఉన్న అత్యాధునిక ప‌రిక‌రాల‌కు తోడు స‌రికొత్తగా వ‌చ్చిన ఈ స్కియా ఆగ్మెంటెడ్ రియాలిటీ ప‌రిక‌రాన్ని కూడా జ‌త చేస్తున్నాం. ఈ ప‌రిక‌రం సాయంతో ఇప్పటివ‌ర‌కు 16 మంది రోగుల‌కు మెద‌డు శ‌స్త్రచికిత్సలు చేశాం. అన్నీ పూర్తిస్థాయిలో విజ‌య‌వంతం అయ్యాయి. దీనివ‌ల్ల రోగికి మ‌త్తు ఇవ్వాల్సిన అవ‌స‌రం గ‌తం కంటే త‌గ్గుతుంది. అంతేకాక‌, న్యూరో నేవిగేష‌న్ కూడా అవ‌స‌రం లేక‌పోవ‌డంతో రోగికి ఖ‌ర్చు కూడా గ‌ణ‌నీయంగా త‌గ్గుతుంది. అత్యంత ఖ‌చ్చిత‌త్వంతో శ‌స్త్రచికిత్స చేయ‌డం సాధ్య‌మ‌వుతుంది. ఆప‌రేష‌న్ స‌మ‌యం కూడా త‌గ్గడంతో రోగి గ‌తంలో కంటే కొంత త్వర‌గా కోలుకుంటారు. ఇదే టెక్నాల‌జీని కొన్ని ర‌కాల కేన్సర్ కేసుల విష‌యంలోనూ ఉప‌యోగించుకోవ‌చ్చు. న్యూరో స‌ర్జరీల విష‌యంలో ఉప‌యోగించ‌డం మాత్రం ప్ర‌పంచంలో ఇదే మొద‌టిసారి. తొలిసారిగా కిమ్స్ ఆస్పత్రిలోనే ఈ ప‌రిక‌రాన్ని ఉప‌యోగించి 16 మంది రోగుల‌కు శ‌స్త్రచికిత్సలు చేశాం” అని కిమ్స ఆస్పత్రి సీనియ‌ర్ క‌న్సల్టెంట్ న్యూరోస‌ర్జన్ డాక్టర్ మానస్ పాణిగ్రాహి వివ‌రించారు.

స్కియా ఎలా ప‌నిచేస్తుంది..

“నిజానికి స్కియా అనేది ముందుగా ఒక అతిపెద్ద కొరియ‌న్ ఎమ్యూజ్‌మెంట్ పార్క్ వారి ఏఆర్ ప్రాజెక్టు. ఇన్‌ఫ్రారెడ్ లేజ‌ర్ల సాయంతో చుట్టుప‌క్కల ప్రాంతాల‌ను ట్రాక్ చేచ‌సేవారు. ఆ స‌మ‌యంలో ఒక మ‌హిళా వైద్యురాలు ఇదే టెక్నాల‌జీని రోగి శ‌రీరంలో ఉన్న అవ‌య‌వాల‌పై ఉప‌యోగించి 3డి ఇమేజ్‌లు ఎందుకు తీసుకోకూడ‌ద‌ని ప్రశ్నించారు. అప్పుడే ఈ ప‌రిక‌రం రూపుదిద్దుకోవ‌డానికి పునాది ప‌డింది. దాదాపు 14 ఏళ్ల పాటు దీనిపై కృషి చేసిన త‌ర్వాత ఎట్టకేల‌కు వైద్యప‌ర‌మైన అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లుగా రూపొందింది. దీన్ని బ్రెస్ట్ కేన్సర్లు, మాక్సిలోఫేషియ‌ల్ స‌ర్జరీలలో కూడా ఉప‌యోగిస్తారు. న్యూరోస‌ర్జరీల‌కు సంబంధించి కీ ఒపీనియ‌న్ లీడ‌ర్ (కేఓఎల్‌)గా డాక్టర్ మాన‌స్ పాణిగ్రాహిని ఎంచుకున్నాం. ఈ టెక్నాల‌జీ అత్యున్నత ప్రమాణాల‌తో కూడుకున్నద‌ని ఆయ‌న నిరూపించారు” అని స్కియా ఇండియా సీఓఓ అభిషేక్ బండారు తెలిపారు.

About Author