‘అరణ్య’ సినిమా రివ్యూ
1 min readచిత్రం: అరణ్య
నటీనటులు: రానా దగ్గుబాటి, విష్ణు విశాల్, జోయ హుస్సేన్, శ్రియ పింగోల్కర్, రవి కాలే, రఘుబాబు, అనంత్ మహదేవన్.
దర్శకత్వం: ప్రభు సాల్మన్
సంగీతం: శాంతను మొయిత్ర
సినిమాటోగ్రఫీ: అశోక్ కుమార్
మాటలు-పాటలు: వనమాలి
నిర్మాణం: ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ
మనిషికి, ప్రకృతికి మధ్య ఉన్న బంధం విడదీయరానిది. ప్రకృతి ఒడిలో పుట్టి, పెరిగిన ఎన్నో వేల కోట్ల జీవరాశులతో పాటు.. మనిషి కూడ ఒక జీవే. మనిషి పరిణామక్రమంలో మిగిలిన జీవుల కంటే ఎన్నో రెట్లు తెలివిగా ఎదిగాడు. కానీ ఆ తెలివిని, అనుభవాన్ని.. తనను తాను నష్టపరుచుకునే ఒక భయంకరమైన అభివృద్ధి నమూనాను తయారు చేయడానికి వినియోగిస్తున్నాడు. తన మనుగడకు కారణమైన ప్రకృతిని నాశనం చేసుకుంటూ.. తనను తాను నష్టపరుచుకుంటూ.. మిగిలిన జీవరాశుల మనుగడకు కూడ ప్రమాదాన్ని తెచ్చి పెట్టే.. ఒక దుస్సాంప్రదాయానికి అభివృద్ధి పేరుతో తెరతీశాడు మనిషి. ప్రకృతిని ధ్వంసం చేసి.. కాంక్రీట్ జంగిల్ ను నిర్మించడమే అభివృధ్ది అనే భ్రమలో మనిషి బతుకుతున్నాడు. ప్రకృతి ధ్వంస రచనలో అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అధికార దుర్వినియోగంతో కూర్చున్న చెట్టునే నరుకుతున్నాడు. ఇలాంటి నేపథ్యంలో నిర్మితమైన చిత్రం అరణ్య
. మనిషికి మంచి చేసే ప్రకృతిని ధ్వంసం చేయడానికి మనిషి ఎంత డబ్బను, అధికారాన్ని, బలగాన్ని ప్రదర్శిస్తాడో ఈ చిత్రం లో స్పష్టంగా చూపించాడు దర్శకుడు ప్రభు సాల్మన్. ముందుగా ఇలాంటి చిత్రంలో నటించేందుకు ఒప్పుకున్న రానా దగ్గుబాటిని అభినందించాలి. కమర్షియల్ చిత్రాల బాటలో వెళ్తున్న రానా దగ్గుబాటి.. పర్యావరణ పరిరక్షణ అనే కాన్సెప్ట్ ను ఎంపికచేసుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం.
కథ: నరేంద్ర భూపతి ప్రకృతి ప్రేమికుడు. అడవిలో, అడవి కోసం బ్రతుకుతున్న ప్రకృతి ఆరాధకుడు. తన అన్నదమ్ములు వంశపారంపర్యంగా వచ్చిన భూములను అమ్ముకుని.. విదేశాల్లో స్థిరపడితే. అరణ్య గా పేరుపొందిన నరేంద్ర భూపతి.. తన తాతలు ప్రభుత్వానికి దానంగా ఇచ్చిన భూమిని, అందులోని అడవిని , జంతువులను తన ప్రపంచంగా బ్రతుకుతుంటాడు. అడవికి, మనిషికి , ఏనుగులకు, జంతువులకు మధ్య ఎంత అవినాభావ సంబంధం ఉందో అందరికి చెబుతుంటాడు. లక్ష మొక్కలు నాటిన నరేంద్ర భూపతి..‘ ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ గా గౌరవించబడతాడు. రాజగోపాలం అనే ఒక ఫారెస్ట్ మినిష్టర్ .. నరేంద్ర భూపతి తాతలు దానం చేసిన అడవి భూమిలో .. అత్యాధునిక సదుపాయాలతో ఒక టౌన్ షిప్ నిర్మించాలనుకుంటాడు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకుని.. అడవిలో 500 ఎకరాల్లో టౌన్ షిప్ నిర్మాణానికి పూనుకుంటాడు. ఈ టౌన్ షిప్ నిర్మాణానికి ‘అరణ్య నరేంద్ర భూపతితో పాటు అడవి ఏనుగులు అడ్డంకులు సృష్టిస్తాయి. అడవి ఏనుగుల బెడద నుంచి తప్పించుకునేందుకు మంత్రి రాజగోపాలం 500 ఎకరాల అడవి చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మిస్తారు. దీంతో అరణ్యకి , మంత్రికి మధ్య పోరాటం మొదలవుతుంది. ఈ పోరాటం ఏ మలుపు తీసుకుంది. ఎలా ముగిసింది అనేది సినిమాలో చూడాల్సిందే.
విశ్లేషణ: అరణ్య పాత్రలో రానా దగ్గుబాటి నటన అద్భుతం . ఆయన మేనరిజమ్స్, ఫిజిక్ అరణ్య పాత్రకు వందకు వంద శాతం సరిపోయింది. సినిమా మొదటి భాగం చాలా ఆసక్తిగా సాగుతుంది. అయితే.. రెండో భాగం మాత్రం కొంత నిదానంగా సాగుతూ.. కథ క్లైమాక్స్ లోకి వచ్చేస్తుంది. దర్శకుడు ప్రభు సాల్మన్ సినిమాని చాలా బాగా తెరకెక్కించే ప్రయత్నం చేసినప్పటికీ.. రెండో భాగంలో మొదటి భాగంలో ఉన్నంత ఆసక్తి .. వేగం ఉండదు. ప్రభు సాల్మన్ ఎంచుకున్న కాన్సెప్ట్ మాత్రం చాలా బాగుంది. కేవలం కమర్షియల్ బ్యానర్ లో వెళ్లకుండా.. ఒక మాన్ , అనిమల్ కాన్సెప్ట్ ను తీసుకోవడం.. దానిని తెరకెక్కించడంలో ఆయన శ్రమ అభినందిచదగ్గది. నిర్మాణంలో కేవలం అడవినే ఎక్కవ సేపు చూపించడం కొంత ఇబ్బందిగా ఉంటుంది. సంగీతం విషయంలో కూడ అవసరమైన ప్రయత్నం చేయలేదని అనిపిస్తోంది. కెమెర పనితనం బాగుంది. వనమాలి అందించిన మాటలు బాగున్నాయి. పాటల విషయంలో ఇంకా కాస్త మెరుగైన ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఇక నక్సలైట్లను చూపించినప్పటికి .. వారి పాత్రలకు ఏ మాత్రం ప్రాముఖ్యత లేదు. నక్సలైట్ల పాత్రలకు.. అరణ్య పాత్రకు మధ్య ఎలాంటి లింక్ లేదు. కేవలం అడవిలో నక్సలైట్లు ఉంటారు అని చూపించడానికి చూపించినట్టు ఉంది.
ముగింపు: ప్రకృతిని ధ్వంసం చేస్తే మనిషి భవిష్యత్తులో ఎలాంటి ఉపద్రవాలు ఎదుర్కొవాల్సి వస్తుందో స్పష్టంగా ఈ సినిమాలో చెప్పారు. ప్రకృతి లేనిదే మనిషి లేడు. మనిషి ప్రకృతితో మమేకమవ్వాలి కానీ.. ప్రకృతిని ధ్వంసం చేయకూడదన్న సందేశం బాగుంది. ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాల్సిన సినిమా ‘అరణ్య’. ఇలాంటి సందేశాత్మక చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన చిత్ర బృందానికి ప్రతి ప్రేక్షకుడు అభినందనలు తెలపాలి.
గమనిక: ఈ రివ్యూ కేవలం ఒక ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. అంతే కానీ చిత్ర బృందం శ్రమని తక్కువ అంచనా వేయడం కాదు. గమనించగలరు.