దసరా సెలవులకు ఉరెళ్తున్నారా.. జాగ్రత్త..! జిల్లా పోలీసుల విజ్ఞప్తి
1 min read– ముందు జాగ్రత్తలు పాటించాలని జిల్లా ప్రజలకు జిల్లా పోలీసు వారి విజ్ఞప్తి.
– మీ యొక్క విలువైన బంగారు, వెండి, నగదు ను సాధ్యమైనంత వరకు బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలి .
–మీరు మీ ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్తున్నారా .! అయితే మీ సమీప పోలీసుస్టేషన్ లో సమాచారం ఇవ్వండి … దొంగతనాలు జరగకుండా ప్రత్యేక నిఘా ఉంచుతాం.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: దసరా పండుగ సెలవుల నేపథ్యంలో సొంత ప్రాంతాలకు వెళ్ళే ఆయా కాలనీ, అపార్టు మెంట్ వాసులు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా పోలీసు అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.ఊళ్లకు వెళ్లే వారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇళ్ళకు తాళం వేసి సొంత గ్రామాలకు వెళ్లే వారు ఇళ్ళల్లో బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, డబ్బులు ఉంచవద్దని జిల్లా పోలీసు అధికారులు తెలిపారు.విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లలో గానీ, లాకర్లు లేని వారు వాటిని తమ తెలిసిన వారి ఇళ్ళల్లో లేదా బంధువుల ఇళ్ళల్లో భధ్రపరుచుకోవాలన్నారు. ఇళ్ళకు తాళం వేసి ఇతర ప్రాంతాలకు వెళ్ళే వారు ముందస్తుగా సమీప పోలీసు స్టేషన్ లో సమాచారం అందించాలన్నారు. దొంగతనాలు జరగకుండా గస్తీ పోలీసులు ఆయా ప్రాంతాలలో రాత్రి వేళ ప్రత్యేక నిఘా ఉంచుతారని జిల్లా పోలీసు అధికారులు తెలిపారు. దసరా సెలవులకు తమ స్వంత ఊర్లకు వెళ్లే వారు ఈ క్రింది సూచనలు, సలహాలను ప్రతి ఒక్కరూ పాటిస్తే మంచిదన్నారు. ఇళ్ళల్లో నగదు, బంగారు, వెండి, ఇతర విలువైన ఆభరణాలు ఉంచుకోరాదు. కొందరు తమ బ్యాగుల్లో నగదు, బంగారు , ఇతర ఆభరణాలను ఉంచుకుని బస్సుల్లో , ఇతర వాహనాలలో ప్రయాణం చేసే సమయంలో దొంగతనాలు జరిగే అవకాశం ఉంది. కావున తగిన జాగ్రత్తలు పాటించాలి. ఎలక్ట్రిషియన్లు, ప్లంబర్లు, కార్పెంటర్లు, గ్యాస్ స్టవ్ రిపేర్ పేరిట అపార్ట్మెంట్ లకు వచ్చే అనుమానిత వ్యక్తులను అనుమతించ కూడదు.కాలనీలలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతూ వుంటే సమీప పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలి. లేదా డయల్ 100 నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలి.వాహనాలను ఇంటి ఆవరణలోనే పార్కింగ్ చేసుకోవాలి. ద్విచక్రవాహనాలకు తాళాలు వేయటంతో పాటు వీలైతే చక్రాలకు కూడా చైన్ లు కూడిన తాళం వేయటం మంచిది. సాధ్యమైనంతవరకు పట్టణ వాసులు తమ ఇండ్లకు సి.సి. కెమెరాలను అమర్చుకొంటే మంచిది. సీసీ కెమెరాలు అన్ లో ఉండే విధంగా చూసుకోవాలి.సెలవుల్లో ఊర్ల కు వెళుతున్న వారు ఇంటి బయట, ఇంటిలో కనీసం 1, 2 లైట్లు వేసి వుంటే మంచిది.ఇంటికి ఇరువైపులా నమ్మకమైన వారు ఉంటే మీరు ఇంట్లో లేని సమయంలో మీ ఇంటిని గమనిస్తూ ఉండమని చెప్పి వెళ్లటం మంచిది.ఆయా కాలనీల సంక్షేమ సంఘాలు ఈ పండుగ సెలవులు ముగిసే వరకు రాత్రి సమయాల్లో గస్తీని ఏర్పాటు చేసుకుంటే దొంగతనాలు అరికట్టవచ్చు. మీ ఆభరణాలను మెరుగు పెడతాం అని , తక్కువ రేటుకు బంగారం, వెండి / నగలను అమ్ముతాము అని ఇళ్ళ దగ్గరకు వచ్చే వారి పట్ల అప్రమత్తంగా వుండాలి.అపార్ట్మెంట్ కాంప్లెక్స్ వారు, మార్కెట్టు, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణములలోనూ మరియు అన్ని వ్యాపార సముదాయాలలో 24×7 సెక్యూరిటీ గార్డ్/ వాచ్ మెన్ లను విధిగా నియమించుకోవాలని , సిసి కెమెరాలను అమర్చుకుంటూ తగిన జాగ్రత్తలు పాటిస్తూ దొంగతనాలను అరికట్టడానికి జిల్లా ప్రజలు పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్ ఐపియస్ గారు విజ్ఞప్తి చేశారు. అత్యవసర సమయాలలో డయల్ – 100 లేదా 112 కు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు.
జిల్లా ఎస్పీ, సిసి కెమోరాలు, ఆర్టీసీ, ఆభరణాలు,