PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గణేష్ నిమజ్జన మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు

1 min read

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట పోలీసు బందోబస్తు

జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్, జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డిలు

పల్లెవెలుగు వెబ్ నంద్యాల: ఈ నెల  22వ తేదీ శుక్రవారం నాడు సామూహిక గణేష్ విగ్రహ నిమజ్జన మహోత్సవ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా శాంతియుత వాతావరణంలో వినాయక విగ్రహాల నిమజ్జనం జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని  జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ పోలీస్ యంత్రాంగాన్ని, సంబంధిత అధికారులను సూచించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డితో కలిసి సంబంధిత అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులతో మొదటి కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. డిఆర్ఓ పుల్లయ్య, గణేష్ మహోత్సవ కేంద్ర సమితి కమిటీ అధ్యక్షులు గంగిశెట్టి విజయకుమార్, రామకృష్ణ విద్యా సంస్థల అధినేత జి. రామకృష్ణారెడ్డి, కార్యాధ్యక్షులు వైద్యం నాగేంద్ర, ప్రధాన కార్యదర్శి నెరవాటి అమర్నాథ్, సివి చలం బాబు, నిమ్మకాయల సుధాకర్, కోశాధికారులు ధమాం శంకర్, రమణ  తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ ఈ నెల 22న  స్థానిక చిన్నచెరువు కట్ట వద్ద ఉన్న వినాయక ఘాట్ లో గణేష్ నిమజ్జనానికి అవసరమైన భద్రతా ఏర్పాట్లతో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు కోరిన మేరకు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గణేష్ విగ్రహాల ఊరేగింపులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు  పోలీసులు, సంబంధిత అధికారులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పరస్పర సహకారంతో నిమజ్జన ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో దాదాపు 320 విగ్రహాలు నిమజ్జనం కానున్నట్లు కమిటీ సభ్యులు సూచిస్తున్నారని… ఇందుకు ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రధానంగా గణేష్ విగ్రహాలు ప్రయాణించే రోడ్డు మార్గాలైన మున్సిపల్ ఆఫీసు, సంజీవనగర్ గేటు, శ్రీనివాస సెంటర్, సిటీ బస్టాండ్, గాంధీచౌక్కల్పనా సెంటర్, బైర్మల్ వీధి, బంగారు అంగళ్ల వీధి, రాజ్ థియేటర్, టెక్కె, సాయిబాబానగర్, ఎన్టీఓస్ కాలనీ, కోవెలకుంట్ల జంక్షన్, బొమ్మలసత్రం తదితర ప్రాంతాలలో విద్యుత్ తీగల సర్దుబాటు, రోడ్లకు ప్యాచ్ వర్క్ లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఊరేగింపు ప్రదేశాల్లోని ముఖ్య కూడలి ప్రాంతాల్లో త్రాగునీటి వసతి ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. నిమజ్జన ప్రదేశంలో పటిష్ట బారికేడింగ్ ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బి  ఈఈని ఆదేశించారు. భారీ గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు వీలుగా క్రేన్లను ఏర్పాటు చేయాలని ఉప రవాణాశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. చిన్న చెరువు, కుందూ నది సమీపంలో పుట్టీలతో పాటు అవసరమైన స్విమ్మర్లను, లైఫ్ జాకెట్, రోప్స్ తదితర మెటీరియల్ తో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ అగ్నిమాపక, మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు. గాంధీ చౌక్, చిన్న చెరువు సమీపంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని డియంహెచ్వోను ఆదేశించారు.జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ రూట్ మ్యాప్ ప్రకారం గణేష్ విగ్రహాల ఊరేగింపుకు పకడ్బందీ ప్రణాళికతో పాటు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులు పోలీస్ యంత్రాంగానికి సంపూర్ణ సహకారం అందించాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలీసు శాఖకు సహకరించి గణేష్ నిమజ్జోత్సవం పూర్తయ్యేంతవరకు కార్యకర్తలు సహకరించాలని సూచించారు.

About Author