PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉగాది మహోత్సవముల ఏర్పాట్లు

1 min read

పల్లెవెలుగు వెబ్ శ్రీశైలం:  ఉగాది మహోత్సవాలు నేటిఅయిదురోజులపాటు నిర్వహించే ఉత్సవాల ఈ నెల 10వ తేదీతో ముగియనున్నాయి. కర్ణాటక మరియు మహారాష్ట్రల నుంచి ఇప్పటికే అధికసంఖ్యలో భక్తులు క్షేత్రాన్ని చేరుకోవడం జరుగుతోంది. భక్తుల సౌకర్యార్థమై వివిధ విస్తృత ఏర్పాట్లు ఆలయ అధికారులు చేపడుతున్నారు.భక్తులు సేద తీరేందుకు పలుచోట్ల చలువపందిర్లు భక్తులకు ఏర్పాటు చేశారు.

దర్శనం ఏర్పాట్లు

భక్తులు అధిక సంఖ్యలో క్షేత్రానికి పాదయాత్ర చేసుకుంటూ శ్రీ గిరికి చేరుకుంటున్నారు. భక్తులందరికీ సంతృప్తికరంగా శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు వీలుగా దర్శన ఏర్పాట్లు చేయడం జరిగింది. వేకువజామున గం.3.00లకు ఆలయద్వారాలు తెరచి, ప్రాత:కాల పూజల అనంతరం వేకువజామున గం. 4.30ల నుంచి సాయంకాలం గం.4.00ల వరకు దర్శనాలు కల్పించబడుతున్నాయి.అదేవిధంగా తిరిగి సాయంత్రం గం. 5.30ల నుంచి అర్థరాత్రి గం. 2.00ల వరకు కూడా దర్శనాలు కొనసాగుతాయి.మొత్తం మూడు క్యూలైన్ల ద్వారా భక్తులకు దర్శనాలు కల్పించబడుతున్నాయి.ఉచిత దర్శనం, శీఘ్రదర్శనం (రూ.200/-), అతిశీఘ్రదర్శనం (రూ.500/-) క్యూలైన్ల ద్వారా

భక్తులకు దర్శన ఏర్పాట్లు చేయబడ్డాయి. అదేవిధంగా శ్రీవృద్ధమల్లికార్జునస్వామివార్లకు అభిషేకం, శ్రీస్వామిఅమ్మవార్ల కల్యాణం ఆర్జితసేవా కర్తలకు ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేయబడింది.భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు ఉత్సవాలలో స్వామివారి స్పర్శదర్శనం పూర్తిగా నిలుపుదల చేయడం జరిగింది. భక్తులందరికీ కూడా స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పించబడుతోంది.భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సదుపాయాలను కల్పించేందుకై దేవస్థానం అన్ని విభాగాలఅధికారులకు, పర్యవేక్షకులకు, ఇతర సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించారు క్యూకాంప్లెక్స్లో వేచివుండే భక్తులకు నిరంతరం అల్పాహారం, బిస్కెట్లు మరియు మంచినీరు, మజ్జిగ అందజేయబడుతున్నాయి.ఉగాది ఉత్సవాలలో వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమైన సంఖ్యలో లడ్డు ప్రసాదాలు సిద్ధం చేయబడ్డాయి. మొత్తం 10కౌంటర్ల ద్వారా ఈ లడ్డు ప్రసాదాలు విక్రయించ బడుతున్నాయి.

భక్తుల రద్దీకనుగుణంగా నీటిసరఫరా చేయడం జరుగుతోంది. రోజుకు 1 కోటి 35 లక్షల లీటర్ల నీటిని సరఫరా చేయడం జరుగుతోంది. క్షేత్రపరిధిలో పలుచోట్ల గల సుమారు 450 పైగా మంచినీటి కుళాయిలను భక్తులకు అందుబాటులోకి తేవడం జరిగింది. క్షేత్రపరిధిలో 40కి పైగా సింటెక్సు ట్యాంకులు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. వేసవి తీవ్రత కారణంగా మహాశివరాత్రి బ్రహ్మత్సవాల కంటే కూడా ఉగాది మహోత్సవాలలో 15 అదనపు సింటెక్సు ట్యాంకులను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే క్షేత్రపరిధిలో శాశ్వతంగా గల 11 ఆర్.సి.సి. వాటర్ ట్యాంకులను కూడా అందుబాటులోకి తేవడం జరిగింది. క్షేత్రపరిధిలో 34 ఆర్.ఓ ప్లాంట్లను కూడా భక్తులకు అందుబాటులో ఉంచబడ్డాయి.అదేవిధంగా సాక్షిగణపతి, హఠకేశ్వరం, శిఖరేశ్వరం, కైలాసద్వారం, పెద్దచెరువు మరియు క్షేత్రములో భక్తులు బస చేసే పలు ప్రదేశాలకు ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా చేయడం జరుగుతుంది. భక్తులు సేదతీరేందుకు వీలుగా టోలేట్ వద్ద గల బసవవనం, సిబ్బంది వసతి గృహాల వద్ద గల బాలగణేశవనం, పాతాళగంగమార్గములోని శివదీక్షా శిబిరాలు, ఆలయ పుష్కరిణి వద్దగల శ్రీపర్వతవనం, ఆలయ దక్షిణమాడవీధిలో గల రుద్రాక్షవనం, శివాజీగోపురానికి ఎదురుగా గల శివాజీవనం మొదలైన చోట్ల ఈ చలువపందిర్లు వేయబడ్డాయి. అలాగే మాడవీధిలో కూడా చలువపందిర్లు వేయడం జరిగింది. అదేవిధంగా కాలిబాట మార్గములోని వెంకటాపురం, నాగలూటి, దామర్లగుంట, పెద్దచెరువు, కైలాసద్వారం, మొదలైనచోట్ల కూడా చలువపందిర్లు ఏర్పాటు చేయబడ్డాయి భక్తులు వాహనాలను నిలుపుకునేందుకు వీలుగా జిల్లా పరిషత్ పాఠశాల సమీప ప్రాంతం, ఆగమ పాఠశాల ఎదురుగాగల ప్రదేశం, విభూతిమఠ సమీప ప్రాంతం మొదలైన 10 చోట్ల పార్కింగు ప్రదేశాలు ఏర్పాటు చేయబడ్డాయి.

About Author