ఆర్యవైశ్యులు.. ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలి
1 min readమాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: ఆర్యవైశ్యులు అటు ఆర్థికంగా, రాజకీయపరంగా ఉన్నత స్థాయికి ఎదగాలని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ రోజు ఎమ్మిగనూరు పట్టణంలోని వాసవి కళ్యాణ మండపంలో కర్నూలు జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులు తమ కుల వృత్తి అయినటువంటి వ్యాపార రంగాన్ని ఎట్టి పరిస్థితులను వదులుకోకూడదన్నారు. ప్రస్తుతం వ్యాపారంగ పరిస్థితి బాగా లేనప్పటికీ తాము ఏ రంగాల్లో అయితే రాణించగలము, అన్నది గుర్తించి అందులో పెట్టుబడులు పెట్టగలిగితే భవిష్యత్తులో వృద్ధిలోనికి రావడానికి అవకాశం ఉంటుందని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఆర్యవైశ్యుల కోసం కృషి చేసే వారిని ఏ పార్టీలో ఉన్నా వారి అభ్యున్నతికి కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. వ్యాపార రంగంలో నిలదొక్కుకున్న తర్వాతనే రాజకీయాల గురించి ఆలోచించాలని, లేకపోతే రెండిట్లోనూ విఫలమై నష్టపోయే అవకాశం ఉందని టీజీ వెంకటేష్ వివరించారు. ఆర్యవైశ్యుల అభ్యున్నతికి ఎన్నో సంస్థలు కృషి చేస్తున్నాయని, వాటి సేవలను ఇక్కడే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎవరికి తగినట్టుగా వారు వినియోగించుకోవచ్చు అని టీజీ అన్నారు . ఆర్యవైశ్యుల ఐకమత్యమే వారి ఎదుగుదలకు అభ్యున్నతికి ఎంతగానో దోహదం చేస్తుందన్నారు.కర్నూలు జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షునిగా దేవకి జనార్ధన్ ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యులు అందరూ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు జయంతి వెంకటేశ్వర్లు, విట్టా రమేష్ తదితరులు పాల్గొన్నారు.