ఆర్యవైశ్యులంటే కులం కాదు.. ఒక కుటుంబం…
1 min readరాజ్యసభ మాజీ సభ్యుడు టి.జి వెంకటేష్
అంతా కలిసి ఉండి సమస్యలు తీర్చుకోవాలి.. టి.జి వెంకటేష్
ఆర్యవైశ్యుల ఐక్యత చాటాలి.. టిడిపి నేత టి.జి భరత్
ఘనంగా ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం.. కార్తీక మాస వనభోజన మహోత్సవం
తరలివచ్చిన ఆర్యవైశ్యులు.. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆర్యవైశ్యులంటే ఒక కులం కాదని.. ఒక కుటుంబం అని రాజ్యసభ మాజీ సభ్యుడు టి.జి వెంకటేష్ అన్నారు. ఆదివారం నగర శివారులోని గాయత్రీ గోశాలలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం.. కార్తీక మాస వనభోజన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టి.జి వెంకటేష్ తో పాటు కర్నూల్ టిడిపి ఇంఛార్జీ టి.జి భరత్, సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు, ఆర్యవైశ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టి.జి వెంకటేష్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులందరినీ ఒక చోట చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. కార్తీక మాసంలో ఇలాంటి గొప్ప కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులకు ఆయన అభినందనలు తెలిపారు. దేశంలో ఆర్యవైశ్యులకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందన్నారు. మనమంతాకలిసి ఉంటే ఎలాంటి కష్టాలు వచ్చినా పరిష్కరించుకోవచ్చన్నారు. రాబోయే రోజుల్లో ఆర్యవైశ్యుల నాయకత్వాన్ని బలపర్చుకోవడం చాలా ముఖ్యమన్నారు. అప్పుడే అభివృద్ధితో పాటు తగిన గౌరవం ఉంటుందన్నారు. మన కుటుంబంలో ఏమైనా ఇబ్బందులుంటే సర్దుకుపోవాలన్నారు.అనంతరం టి.డి.పి ఇంచార్జి టి.జి భరత్ మాట్లాడుతూ ఆర్యవైశ్యుల ఐక్యత చాటాలని పిలుపునిచ్చారు. ఎంతో పవిత్రమైన గోశాలలో కార్తీన వన భోజనం కార్యక్రమం జరగడం గొప్ప విషయమన్నారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లల్ని గోసేవ చేసేలా ప్రోత్సహించాలని కోరారు. 850 పైన గోవులు ఉండే ఈ గోశాల రాష్ట్రంలోనే పేరొందిందన్నారు. ఇక ఇలాంటి గొప్ప వేదికలో మీ అందరి దీవెనలు తాను కోరుకుంటున్నట్లు భరత్ ఆర్యవైశ్యులను ఉద్దేశించి మాట్లాడారు. ఆర్యవైశ్యులకంటూ ఒక గుర్తింపు కావాలంటే మనఐక్యత చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అప్పుడే ఏ ప్రభుత్వమైనా, ఏ రాజకీయ పార్టీ అయినా మనకు తగిన గౌరవం ఇస్తుందని తెలిపారు. రానున్న ఎన్నికలను టార్గెట్ చేసి ఆర్యవైశ్యుల్లో దాదాపు 20 శాతం ఓట్లు తొలగించినట్లు చెప్పారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఆర్యవైశ్యులందరూ ఆలోచించి మంచి చేసే వ్యక్తిని ఎన్నుకోవాలని సూచించారు. ప్రజలకు మంచి చేసేది ఎవరో తెలుసుకోవాలన్నారు. ఓటు వేసే ఒక్క రోజు కష్టపడితే.. ఐదేళ్లు సంతోషంగా తాను చూసుకుంటానని చెప్పారు. ఇండస్ట్రీస్ తీసుకొచ్చే కెపాసిటీ తనకు ఉందని.. ఇక్కడకు కంపెనీలు వస్తే యువతకు ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా వస్తాయని వివరించారు. తాను గెలిస్తే ఒక వ్యక్తికి లాభం రాదని.. మొత్తం కర్నూలు బాగుపడుతుందన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. లలితా పీఠం సుబ్బుస్వామి ఆధ్వర్యంలో శివపార్వతులకు సప్త హారతుల కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం లక్కిడిప్ నిర్వహించి అందులో గెలిచిన వారికి బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘాల పెద్దలు, ఆర్యవైశ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.