సల్మాన్ రష్దీ పై హత్యాయత్నం !
1 min readపల్లెవెలుగువెబ్ : భారత సంతతికి చెందిన వివాదాస్పద నవలా రచయిత సల్మాన్ రష్దీపై అమెరికాలో హత్యాయత్నం జరిగింది. భావ ప్రకటనా స్వేచ్ఛపై న్యూయార్క్ సమీపంలోని ఓ పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో… రష్దీ ప్రసంగించడానికి సిద్ధమవుతుండగా దుండగుడు వేదికపైకి ఎక్కి కత్తితో దాడికి తెగబడ్డాడు. సెకన్ల వ్యవధిలోనే 10-15 కత్తిపోట్లు వేయడంతో రష్దీ అక్కడే కుప్పకూలిపోయారు. రక్తపు మడుగులో ఉన్న ఆయనను వెంటనే హెలికాప్టర్ సాయంతో ఆసుపత్రికి తరలించారు. రష్దీ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ‘ప్రవాస రచయితలకు, కళాకారులకు ఆమెరికా ఆశ్రయం: భావ ప్రకటనా స్వేచ్ఛకు నిలయం’ అన్న అంశంపై జరుగుతున్న సెమినార్‌లోనే రష్దీపై హత్యాయత్నం జరగడం గమనార్హం. భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 8.30గంటల సమయం లో ఈ దాడి జరిగింది. రష్దీ పక్కనే ఉన్న మరో వ్యక్తికి స్వల్పగాయాలయ్యాయి. వేదికపై ఉన్నవారే ఘాతుకానికి పాల్పడిన వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.