అసైన్మెంట్ భూముల చట్ట సవరణ ఆర్డినెన్స్ ను రద్దు చేయాలి..
1 min read– వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వీరశేఖర్
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పేదలకు సాగు భూములు పై హక్కు కల్పిస్తున్నామనే సాకుతో దళిత, బడుగు, బలహీన వర్గాల పేదల దగ్గర ఉన్న భూములను పెద్దలకు కట్టబెట్టే ప్రయత్నం అసైన్మెంట్ చట్ట సవరణ ఆర్డినెస్ బిల్లు తీసుకువచ్చారని, తక్షణమే దీనిని రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బి వీర శేఖర్ డిమాండ్ చేశారు.ఈ మేరకు గురువారం నాడు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ పిలుపుమేరకు స్థానిక తాసిల్దార్ వెంకటేష్ నాయక్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వీరశేఖర్ మాట్లాడుతూ, పేదలు అనుభవములో ఉన్న భూములను ఇతరులకు విక్రయించుకోవచ్చు అన్న చట్ట సవరణ ద్వారా పేదల దగ్గర ఉన్న భూములు రియల్ ఎస్టేట్ మరియు రాజకీయ పెద్దల చేతుల్లోకి వెళతాయని అన్నారు. దీనివలన ప్రభుత్వం ఏదైతే భూమి ద్వారా పేదలను ఆర్థికంగా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఉందో దానికి ఈ చట్టసవరణ పూర్తి వ్యతిరేకమని తెలిపారు. ఇప్పటికే ఈ చట్టసరణ పై రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రజాసంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘం రద్దుకై డిమాండ్ చేయగా ప్రభుత్వం కొన్ని నిబంధనలతో ఈ సవరణ ఆమోదించాలని అధికారులకు సూచించిందని, దీనిని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సిసిఎల్ ఏ నిబంధనల ప్రకారం ఎవరైతే ప్రభుత్వ భూములు సాగు చేసుకుంటున్నారు, అనుభవంలో ఉన్నవారి పేర్ల ను బహిరంగంగా సచివాలయం దగ్గర మొదటి దశ లో ప్రదర్శించాలని కోరారు. అదేవిధంగా ఆర్డిఓ, జాయింట్ కలెక్టర్ ద్వారా విచారణ నిర్వహించి హక్కులు కల్పిస్తామన్న మాటలు క్షేత్రస్థాయిలో జరగడంలేదని చాలా భూమి కొంతమంది పెద్దల చేతుల్లోనే ఉందని, కేవలం పట్టాలు తమ పేరుతో ఉండి అనుభవం లేకుండా ఉంటున్నారని వీటి దృష్ట్యా వెంటనే సచివాలయాల్లో భూముల అనుభవదారుల పేర్లు ప్రకటించాలని వారు తాసిల్దార్ ను డిమాండ్ చేశారు. ప్రజా అభిప్రాయం తీసుకొని చట్ట సవరణ ను ముందుకు తీసుకోవాలని, ఆన్లైన్ ప్రక్రియ నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు.ఇప్పటికే పేదలు సాగు చేసుకుంటున్న భూములకు పేదలకు పట్టాలు ఇవ్వాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు అశోక్ ,రంగన్న ,కుమార్ తదితరులు పాల్గొన్నారు.