తెలుగుదేశం కేంద్ర కార్యాలయం పై దాడి..నాయకులపై కూడ !
1 min readపల్లెవెలుగు వెబ్ : తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు.. నాయకుల పై దాడితో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంగళగిరిలోని తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయం పై పదుల సంఖ్యలో దుండగులు దాడి చేశారు. పెద్దకర్రలు, రాళ్లతో దాడికి దిగారు. అక్కడ ఉన్న సిబ్బందిని కూడ తీవ్రంగా గాయపరిచారు. ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి విశృంఖలంగా సాగవుతోందని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు సోమవారం విమర్శలు చేశారు. నర్సీపట్నం పోలీసులు వెంటనే గుంటూరు వచ్చి నక్కా ఆనంద్ బాబుకు నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ పరిణామాలపై తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్ ను తీవ్రమైన స్థాయిలో విమర్శించారు. ఈ నేపథ్యంలో కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఇంటిపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఆయన ఇంటిలో సామాగ్రిని ధ్వంసం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయం పై దాడి జరిగిన కొద్దిసేపటికే విశాఖపట్నం, నెల్లూరు, చిత్తూరులోని టీడీపీ కార్యాలయాలపై దాడికి యత్నించారు. ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి ఇంటి ముందు వైసీపీ నేతలు ధర్నా చేశారు. హిందూపురంలో బాలకృష్ణ ఇంటిని వైసీపీ నేతలు ముట్టడించారు.
అమిత్ షాకు చంద్రబాబు ఫోన్ : రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం కార్యాలయాలకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కోరారు. మొదటగా డీజీపీ కార్యాలయానికి ఫోన్ చేశారు. అక్కడ నుంచి సరైన స్పందన రాకపోవడంతో కేంద్ర ప్రభుత్వ అధికారులకు, హోంమంత్రి అమిత్ షాకు చంద్రబాబు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు.