కన్హయ్య హత్య కేసు నిందితుల పై కోర్టులో దాడి
1 min readపల్లెవెలుగువెబ్ : ఉదయ్‌పూర్ టైలర్ కన్హయ్య లాల్ హత్య కేసు నిందితులపై శనివారంనాడు ఉదయం దాడి జరిగింది. జైపూర్‌లోని కోర్టు ఆవరణలో లాయర్లు ఈ దాడికి పాల్పడ్డారు. కన్హయ్య హత్య కేసులో నలుగురు నిందితులను జైపూర్‌లోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ముందు భారీ భద్రత మధ్య ఉదయం హాజరుపరిచారు. ప్రధాన నిందితులైన రియాజ్, గౌస్ మహమ్మద్‌తో పాటు మరో ఇద్దరు నిందితులను అజ్మీర్ జైలు నుంచి జైపూర్‌కు తీసుకువచ్చారు. కోర్టు ఆవరణలోనూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోర్టు నుండి నిందితులను బయటకు తీసుకు వెళ్తుండగా న్యాయవాదులు ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోతూ వారిపై దాడికి దిగారు. ”మారో మారో” అంటూ నినాదాలు చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అక్కడి నుంచి వారిని తప్పించి పోలీసు వ్యాను ఎక్కించారు.