వాట్సాప్ లో వేలం.. మహిళల అక్రమ రవాణా !
1 min readపల్లెవెలుగువెబ్ : హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మహిళల అక్రమ రవాణ గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. ఆర్థిక అవసరాలే బలహీనతగా మార్చుకుని కొందరు దందా నిర్వహిస్తున్నారు. అమ్మాయిల ఫోటోలు విదేశాల్లోని వ్యక్తులకు పంపుతారు. నచ్చితే ఆన్ లైన్ లోనే వేలం వేస్తారు. గుట్టు చప్పుడు కాకుండా దేశం దాటిస్తారు. చాపకింద నీరులా విస్తరించిన అమ్మాయిల అక్రమ రవాణ పోలీసులకు పెను సవాల్ గా మారింది. ఇటీవల 14 ఏళ్ల బాలికను తల్లి, అమ్మమ్మ సహకారంతో 61 ఏళ్ల వృద్ధుడికి రూ.5లక్షలకు అమ్మకానికి పెట్టిన ఉదంతం బాలాపూర్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో 9 మంది ఉన్న ముఠాను రాచకొండ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు.
అక్రమ రవాణా ముఠాలు ఆటో డ్రైవర్లు, తాగుబోతు తల్లిదండ్రులు, అడ్డా కూలీలు, పనివాళ్లుగా బతుకుతున్న వారిలో ఆడపిల్లలు సంతానం ఎక్కువగా ఉన్న కుటుంబాలను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ముఠా సభ్యులు వారి బలహీనతలను ఆసరాగా చేసుకొని ఏదో ఒక విధంగా పరిచయం పెంచుకుంటున్నారు. చిన్న ఆపదలు, కష్టాలు తీరుస్తూ ఆర్థికంగా అండగా ఉంటారు. అలా వారిని బుట్టలో వేసుకొని కొంతకాలం పాటు.. నమ్మకంగా నటిస్తారు. ’’మీ సంపాదనతో ఆడపిల్లలను పెంచడం, చదివించడం, పెళ్లిలు చేయడం చాలా కష్టమైన పని.. కాబట్టి ఇతర ప్రాంతాల్లో మాకు తెలిసిన పెద్ద సంస్థలు, సంపన్నులు ఉన్నారు. వారు నిరుపేద పిల్లలకు మంచి చదువు చెప్పించి, వారి కాళ్లమీద వారు బతికేలా చేస్తారు. వారే పెళ్లి చేసి మంచి జీవితాన్ని ఇస్తారు. అంతేకాదు.. పిల్లలను వారితో పంపితే.. మీ ఆర్థిక కష్టాలు కూడా తీరుస్తారు. అందుకు అవసరమైన డబ్బును ముందే చెల్లిస్తారు’’ అంటూ నమ్మిస్తారు. వారి ఫోటోలు పంపి.. ఆన్ లైన్ లోనే వేలం వేస్తారు. ఇలాంటి ముఠాల ఆటకట్టించేందుకు రాచకొండ పోలీసులు రంగంలోకి దిగారు. అక్రమ రవాణ పై ఉక్కుపాదం మోపుతామని తెలిపారు.