PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆటో చోదకులు ప్రమాదాల నివారణకు అత్యంత జాగ్రత్త వహించాలి..

1 min read

జిల్లా రవాణా అధికారి టి. ఉమామహేశ్వరరావు

పల్లెవెలుగు వెబ్ పశ్చిమగోదావరి  : శుక్రవారం జిల్లా రవాణాశాఖ కార్యాలయం నందు జిల్లా రవాణా అధికారి టి.ఉమామహేశ్వరరావు భీమవరం పరిధిలోని సుమారు 200 మంది ఆటో యూనియన్ నాయకులు, ఆటో చోదకులతో అవగాహన సదస్సును  నిర్వహించి, వారికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డి.టి.ఓ మాట్లాడుతూ ఆటో చోదకులు డ్రైవింగ్ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించారు. వివిధ సందర్భాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలను  చోదకులకు చూపించి వాటిమీద పూర్తి అవగాహన కల్పించేందుకు ప్రదర్శించడం జరిగింది.  రహదారి కూడళ్ళలో సిగ్నల్స్ ను విధిగా పాటించవలసినదిగా తెలియజేసారు. ఆటో నడుపు సమయంలో క్రమశిక్షణ పాటించడం వలన చలానాలు చెల్లించవలసిన అవసరం ఉండదన్నారు. మీ ప్రయాణం వెనుక మీ కుటుంబం ఉన్నదని అది ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలన్నారు. ఇరుకైన వీధులు, రోడ్డు కూడళ్ళలో సాధ్యమైనంత వరకు నిదానంగా వాహనాన్ని నడపాలని సూచించారు.  రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వాహన మిత్ర  సహాయాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ పొందడానికి యూనియన్ నాయకులు చొరవ చూపాలన్నారు.భీమవరం మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ సిహెచ్ వెంకట రమణ మాట్లాడుతూ డ్రైవింగ్ లో మెళుకువలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారికి పూర్తి అవగాహన కల్పించారు. ఆటో నడుపు సమయంలో మద్యం, ఇతర మత్తు పదార్థాలను  సేవించడం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదన్నారు. ముగ్గురుకు మించి ప్రయాణికులను ఆటో ఎక్కించుకోవడం నిబంధనలకు విరుద్ధం అన్నారు. భీమవరం మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ కే.ఎస్.ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ ఆటోలు నిర్వహణలో పాటించవలసిన విధులు గురించి వివరించారు, ఆటో నడుపు సమయమున మొబైల్ మాట్లాడుతూ వాహనము నడపరాదు అని సూచించారు. అతి వేగముతో ఆటోను నడపరాదని, విశాఖపట్నంలో జరిగిన సంఘటనే ఉదాహరణగా తీసుకోవాలన్నారు.  రాంగ్ రూట్ లో ఆటోలను నడపరాదన్నారు.భీమవరం ట్రాఫిక్ సిఐ సి.దాసు మాట్లాడుతూ ఓవర్ లోడింగ్, అతి వేగముతో వాహనము నడపరాదు అని సూచించారు. ఆటో యూనియన్ అధ్యక్షులు ఇంటి సత్యనారాయణ మాట్లాడుతూ ఓవర్ లోడింగ్, మద్యము సేవించి, అధిక వేగము, రాంగ్ రూట్ లో వాహనము నడపరాదు అని ఆటో చోదకులకు సూచించారు. ఈ అవగాహన సదస్సులో అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ ఏన్ఎల్ఎఎస్ లక్ష్మి, అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ ఏం.రవి కుమార్, భీమవరం యూనియన్ అధ్యక్షులు  పి.గోపి, భీమవరం టౌన్ ఆటో యూనియన్ లు,  చైతన్య ఆటో యూనియన్, స్నేహ ఆటో యూనియన్, అమరావతి ఆటో యూనియన్ నాయకుల, డ్రైవర్లు పాల్గొన్నారు.

About Author