టాక్స్ ప్రొఫెషనల్స్ చట్టాల పట్ల అవగాహన ఉండాలి
1 min readదేశ ఆర్థిక పురోగతిలో టాక్స్ ప్రొఫెషనల్స్ పాత్ర ప్రశంసనీయం
పల్లెవెలుగు వెబ్ విజయవాడ: దేశ ఆర్థిక పురోగతిలో టాక్స్ ప్రాక్టీషనర్స్, ట్యాక్స్ అడ్వొకేట్స్, ఛార్టర్డ్ ఎకౌంటెంట్ పాత్ర ప్రశంసనీయమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.కిరణ్మయి అన్నారు. స్థానిక తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో శనివారం జరిగిన ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ టాక్స్ ప్రాక్టీషనర్స్ (సదరన్ జోన్) నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి జస్టిస్ కిరణ్మయి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ- ప్రతి ప్రాక్టీషనర్ నిబద్ధతతో తమ వృత్తిని నిర్వహిస్తూ వ్యాపార వర్గాలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ వ్యాపారస్తుల సమస్యలను తగురీతిలో పరిష్కరించాలని కోరారు. వ్యాపారవర్గాల సమస్యలను పరిష్కరించటమే కాకుండా వారు నిజాయితీగా ప్రభుత్వానికి పన్నులు చెల్లించేలా చూడవలసిన బాధ్యతను తీసుకోవాలన్నారు. నూతనంగా ఎన్నికైన ఛైర్మన్ రామరాజు శ్రీనివాసరావు మాట్లాడుతూ- సోదర సభ్యుల సహకారంతో అమలులో వున్న చట్టాలలోని ఇబ్బందులను తొలగించటంలో తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. మరో అతిధి ప్రముఖ న్యాయవాది డా.ఎమ్వీకే మూర్తి మాట్లాడుతూ – ప్రాక్టీషనర్స్ చట్టాల పట్ల పూర్తి అవగాహన కలిగి తమ క్లయింట్కు తగిన రీతిలో సరైన సలహాలు ఇవ్వాలని కోరారు. ప్రముఖ న్యాయవాది, వాణిజ్య పన్నుల శాఖ పూర్వ జాయింట్ కమిషనర్ పి.వి.సుబ్బారావు మాట్లాడుతూ- టాక్స్ ప్రొఫెషనల్స్ వృత్తిపట్ల నిబద్దతతో, చట్టాల పట్ల అవగాహనతో తమ క్లయింట్స్కు సేవ చేయాలని కోరారు. హైకోర్టు న్యాయవది ఎం.వి.జె.కె.కుమార్ మాట్లాడుతూ-సౌత్జోన్కు ఈరోజు బాధ్యతలు చేపట్టిన వారు, జోన్ లోని సమస్యల్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియజేస్తూ ప్రాక్టీషనర్స్కు చట్టం పట్ల అవగాహన కలిగించేందుకు సెమినార్లు నిర్వహించాలని కోరారు. కార్యదర్శిగా ప్రమాణం చేసిన చక్ర రమణ వందన సమర్పణ చేశారు. కార్యక్రమంలో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి నుండి 600లకు పైగా సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందు జరిగిన రామరాజు లక్ష్మీ శ్రీనివాస్ వీణ కచేరి సభికుల్ని విశేషంగా అలరించింది.