PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘రొమ్ము క్యాన్సర్​’పై..అవగాహన పెరగాలి

1 min read

– డా.ల‌క్ష్మి ప్రసన్న‌, కన్సల్టెంట్ ఒబెస్ట్రైటిక్ & గైనకాల‌జిస్ట్‌ , కిమ్స్ హాస్పిట‌ల్‌, క‌ర్నూలు

పల్లెవెలుగు వెబ్​: క్యాన్సర్.. ఈ పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. శరీరంలో ఏ భాగానికైన క్యాన్సర్ సోకే ప్రమాదం ఉంది. స్త్రీలలో  రొమ్ము క్యాన్సర్ అనేది ఇటీవల కాలంలో ఎక్కువగా సంభవిస్తుందని తేలుతోంది. దీనికి ప్రధాన కారణం మారుతున్న జీవనశైలి. దీని వల్లే రొమ్ము క్యాన్సర్​తో పాటు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. సాంకేతికతగా మానవుడు పెరుగుతున్నా రొమ్ము క్యాన్సర్ మీద అవగాహన అంతగా పెరగడం లేదు.  అక్టోబర్ మాసాన్ని రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వివిధ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాము.

ఏటా 23 లక్షల మంది బాధితులు..:

కొన్ని నివేదికల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఏటా 23 లక్షల మంది రొమ్ము క్యాన్సర్  భారినపడుతున్నారు. వీరిలో  6.85  లక్షల మంది మరణిస్తున్నారు. మన దేశంలో 1.62 లక్షల మంది మహిళలు రొమ్ము క్యాన్సర్కి గురవుతున్నారు. గణాంకాల ప్రకారం 2030 సంవత్సరానికి ఏటా 2 లక్షల మహిళలకు సోకే అవకాశం వుందని అంచనా. ప్రతి 8 నిమిషాలకు ఒకరు రొమ్ము క్యాన్సర్కి బలవుతున్నారు అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇలా జరగడానికి అవగాహన లోపమే ప్రధాన కారణం.

రొమ్ము క్యాన్సర్ రావడానికి కారణాలు: జన్యుపరమైన సమస్యలు, జీవనశైలి, పరిసరాల ప్రభావం. వయసు పెరిగే కొద్దీ ఈ రొమ్ము క్యాన్సర్ బారినపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దేశంలో చిన్న వయసులోనే ఈ క్యాన్సర్ ముంచుకొస్తోంది. అంటే, 50 ఏళ్ల లోపు ఉన్నవారిలో ఈ రొమ్ము క్యాన్సర్ బయటపడుతుంది. చిన్న వయసులో రజస్వలవడం, ఆలస్యంగా మెనోపాజ్ కావడం, లేటుగా పిల్లలు కలగడం, తక్కువ కాలం పాలు ఇవ్వడం, ఊబకాయం, తగినంత వ్యాయాయము లేకపోవడం. ఊబకాయం ఉన్నవారికి రొమ్ముల్లో కొవ్వుకణజాలం ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఈ క్యాన్సర్ సోకే ప్రమాదం ఉంది. మన ఆహారముతో శరీరంలోకి ప్రవేశించే  పురుగుమందులు శరీరంలో ఈస్ట్రోజన్ లాగా పనిచేస్తాయి. నెలసరి ఆగిపోయిన తర్వాత వచ్చే ఊబకాయంతో రొమ్ము క్యాన్సర్ పెరిగే అవకాశం ఉంది. అంతకు ముందే అధికబరువు ఉన్న వారిలో కూడా ఈ ప్రమాదం ఉంటుంది.  ఇవీ క్యాన్సర్ ముప్పు పెరిగేలా చేస్తాయి.

వ్యాయామం… తప్పనిసరి..: వ్యాయామం చేయకపోవడం కూడా ఒక ప్రధాన కారణం. క్రమ తప్పకుండా వ్యాయామం చేసే వారిలో క్యాన్సర్లు సోకే ప్రమాదం తక్కువగా ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రతి రోజు గంట పాటు వ్యాయామం చేయాలి. ఇక ఆడవారిలో పోగాకును ఏ రూపంలో తీసుకున్నా – అంటే నమలడం, సిగరేట్లు, బీడీలు కాల్చడం, మద్యం సేవించే వారిలో ఈ క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుంది.  ఆలస్యంగా పిల్లలు కనేవారిలో కూడా ఈ క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉంది. అసలు పిల్లలే లేని స్త్రీలలో  ఈ ప్రభావం మరీంత ఎక్కువగా ఉంటుంది.   వీలైనంత వరకు 30 ఏళ్ల లోపే సంతానం కలిగేలా చూసుకోవాలి.  అలాగే ప్రసవించిన స్త్రీలు తమ పిల్లలకు చనుబాలు ఇవ్వడంలో ఆసక్తి చూపరు. కానీ పిల్లలకు చనుబాలు ఇవ్వడం వల్ల రొమ్ముక్యాన్సర్ ముప్పు తగ్గుతుంది. ఆరు నెలల పాటు తప్పకుండా శిశువులకు చనుబాలు ఇవ్వాలి.

రొమ్ములో మార్పును… త్వరగా గుర్తించాలి: రొమ్ము క్యాన్సర్ ని ఎదుర్కొనే సమర్ధవంతమైన ఏకైక మార్గం త్వరగా గుర్తించడమే. రొమ్ము క్యాన్సర్ లేకపోయినా రొమ్ముల తీరును గమనిస్తూ ఉండాలి. రొమ్ము సైజులో మార్పులు రావడం, చర్మం మీదు, చనుమొనల చుట్టూ ఎరుపు లేదా దద్దుర్లు రావడం, రొమ్ములో ఎక్కడైన మందంగా, గట్టిగా    గడ్డలు తగలడం, చనుమొనలు లోపలికి వెళ్లడం, మొనల నుండి రక్తం కారడం, రొమ్ముల మీద సొట్టపోవడం, రొమ్ముల్లో, చంకల్లో పిక్కలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.  నలభై అయిదు ఏళ్లు దాటిన వారు తప్పకుండా ప్రతి సంవత్సరం వైద్యుని తో పరీక్షతో పాటు, మామోగ్రామ్ పరీక్ష చేయించుకోవాలి.

About Author