ఆయు కట్టు రైతులకు సాగునీరు ఇవ్వాలి: కోట్ల
1 min read– గాజులదిన్నె ప్రాజెక్టును పరిశీలించిన మాజీ కేంద్రమంత్రి కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి
పల్లెవెలుగు, వెబ్ గోనెగండ్ల: గోనెగండ్ల మండలం, గాజులదిన్నె ప్రాజెక్టులో నిలువ ఉంచిన నీటిని విడుదల చేసి 18 వేల ఎకరాల ఆయు కట్టు రైతులకు పంటలు ఎండిపోకుండా సాగునీరు ఇవ్వాలని మాజీ కేంద్రమంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి కోరారు. ఆయన సోమవారం టిడిపి నేతలతో కలిసి గాజులదిన్నె ప్రాజెక్టును సందర్శించి పరిశీలన చేశారు. అక్కడే ఉన్న ప్రాజెక్ట్ అధికారులతో కాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రైతులు సాగునీరు సకాలంలో అందక అల్లాడిపోతుంటే డ్రింకింగ్ పర్పస్ పేరుతో ప్రాజెక్టులో నీళ్లు నిల్వ చేయడం ఎంతవరకు సబబు అన్నారు. సాగునీరు విడుదల చేసి డ్రింకింగ్ పర్పస్ కోసం లిఫ్ట్ ద్వారా ప్రాజెక్టులో నీళ్లు నింపాలని సూచించారు. ప్రాజెక్టు ఎత్తు పెంచి రెండు టీఎంసీ నీళ్లు నింపుతామన్న వైయస్సార్సీపి మంత్రులు, ఎమ్మెల్యేలు కేవలం ఆర్భాటాలకే పరిమితమయ్యారని ఆరోపించారు, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోవడంతో పనులు సాగడం లేదని ఎత్తు పెంచడం వల్ల చాలామంది రైతులు భూములు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ హాయంలో హంద్రీనీవా ద్వారా గాజులదిన్నె ప్రాజెక్టుకు నీటిని సరఫరా చేసిన ఘనత కోట్ల కుటుంబంకే దక్కిందన్నారు. తాను రాజకీయ మార్పు కోరి చంద్రబాబు సహకారంతో గుండ్రేవుల,వేదవతి, ఆర్డీఎస్ కుడికాలువ నిర్మాణం, ఎల్ ఎల్ సి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ నిర్మాణాలకు జీవోలు తీసుకువస్తే నేడు ముఖ్యమంత్రి జగన్ తుంగలో తొక్కి కర్నూలు జిల్లా ప్రజలకు తీరిన అన్యాయం చేశారని మండిపడ్డారు. పెండింగ్ ప్రాజెక్టుల సాధన కోసం ముఖ్యమంత్రి జగన్ పై ఒత్తిడి తెచ్చే దమ్ము ధైర్యం కర్నూలు జిల్లా మంత్రులు,ఎమ్మెల్యేలకు లేకపోవడం విచారకరమన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి కర్నూలు జిల్లా ను సస్యశ్యామలంగా మార్చి రైతులకు అంకితం చేస్తామని తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలో హగరి వంతెన పిల్లర్లు కూలిపోవడంతో కర్నూలు జిల్లా వైపు రావలసిన నీరు ఆగిపోవడంతో రెండున్నర లక్షల ఎకరాల ఆయుకట్టు భూమి నీరు అందక ఎండిపోయే పరిస్థితి దాపురించిందన్నారు. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు కర్ణాటక ప్రభుత్వంతో చర్చించి సాగునీరు విడుదల చేయించాల్సింది పోయి నిద్రపోతున్నారని దుయ్యపడ్డారు. ఎల్. ఎల్. సి. ఆయుకట్టుకు సకాలంలో సాగునీరు అందించకపోతే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కోట్ల వెంట టిడిపి డోన్ నియోజకవర్గం నాయకులు పి.లక్ష్మిరెడ్డి, గోనెగండ్ల మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎంపీపీ కె.వి. కృష్ణారెడ్డి, సింగిల్ విండో మాజీ ప్రెసిడెంట్ పెద్ద నేలటూరు పరమేశ్వర రెడ్డి, ప్రభాకర్ నాయుడు,గోనెగండ్ల మాజీ సర్పంచ్ బి.రంగముని, ఎమ్మిగనూరు టిడిపి నాయకులు ఆరవీటి సుధాకర్ శెట్టి, కదిరికోట ఆదెన్న, జిల్లా మాజీ వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ జి, అల్తాఫ్, మాజీ కౌన్సిలర్ హరి ప్రసాద్ రెడ్డి, బూదురు రాఘవేంద్ర రెడ్డి, గోనెగండ్ల మండలం అల్వాల సర్పంచ్ డాక్టర్ భాష, హెచ్ కైరవాడి రంగూన్ భాష, గంజాహళ్లి లక్ష్మన్న, గోనెగండ్ల బాబు నాయుడు, కౌలుట్లయ్య, ఎమ్మిగనూరు మండలం, కే తిమ్మాపురం గ్రామ నాయకులు ఉప్పర వీరేష్, తదితరులు పాల్గొన్నారు.