వెన్నుపోటుకు బాబు బ్రాండ్ అంబాసిడర్
1 min read
పత్తికొండ, న్యూస్ నేడు: వెన్నుపోటు రాజకీయాలకు చంద్రబాబు ఒక బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచిపోతారని వైఎస్ఆర్సిపి కర్నూల్ జిల్లా అధ్యక్షుడు ఎస్ వి మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం పత్తికొండ స్థానిక గోపాల్ ప్లాజాలో నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. నియోజకవర్గ పరిధిలోని ఐదు మండల కార్యకర్తలు పెద్ద ఎత్తున సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్సిపి నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ, కార్యకర్తల్లో భయాన్ని సృష్టించాలని చూస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా పేదల జీవితాల్లో చీకట్లు నింపిందని జగనన్నకు తోడుగా, పేద ప్రజలకు అండగా కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలనను ఎండగొట్టేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని వారు పిలుపునిచ్చారు. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా గడప-గడపకు వెళ్లి బాబు ఇచ్చిన పథకాలు అమలు చేశారా లేదా అన్న విషయాన్ని ప్రజలకు అవగాహన కల్పించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. బాబు చేసిన మోసాన్ని ప్రజలకు వివరిస్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా టిడిపి నాయకులు ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు.ఎమ్మెల్సీ మధుసూదన్ మాట్లాడుతూ, అధికారం కోసం చంద్రబాబునాయుడు ప్రజలను హామీలతో మోసం చేశారన్నారు. వైఎస్సా ర్సీపీ ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా అమలు చేసి పేదల ఇళ్లకు నవరత్నాలు చేర్చారని వైఎస్ఆర్సిపి నాయకులు తెలిపారు.
