హద్దు మీరితే ఖబడ్దార్: బాలకృష్ణ
1 min read
పల్లెవెలుగు వెబ్: అసెంబ్లీలో సభ్యులపై వ్యక్తిగత విమర్శలు చేయడం దారుణమని ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ మండిపడ్డారు. తన భార్యను అవమానించారని ఆరోపిస్తూ చంద్రబాబు నిన్న మీడియా సమావేశంలో బోరున విలపించిన సంగతి తెలిసిందే. దీనిపై నందమూరి ఫ్యామిలీ ఇవాళ స్పందించింది. చంద్రబాబు చాలా గట్టి మనిషి అని.. ఆయన ఎప్పుడూ కంటతడి పెట్టింది తాను చూడలేదని బాలకృష్ణ అన్నారు. అసెంబ్లీలో వ్యక్తిగత దూషణలకు దిగుతూ.. ఎదుటి వారి పరువును బజారుకీడ్చేలా చేస్తున్నారని విమర్శించారు.
అధికారపక్షం తన చెల్లిని అవమానించడం దురదృష్టకరమన్నారు. ఇకపై హద్దుమీరి ప్రవర్తిస్తే.. భరతం పడతామని హెచ్చరించారు. ఇన్నాళ్లు చంద్రబాబు ఆపితేనే సహించామని.. ఇకపై దాడికి ప్రతి దాడి చేస్తామని బాలకృష్ణ స్పష్టం చేశారు. అసెంబ్లీలో సభ్యుల మాటలు వింటుంటే.. గొడ్ల చావిడిలో ఉన్నామన్న అనుమానం మానక కలగక మానదు అని పేర్కొన్నారు.
సభలో హుందాగా నడుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. స్పీకర్ ఉన్నా లేనట్టే ఉందని, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబు ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారని, ఇప్పుడు ఏం జరుగుతోందని బాలకృష్ణ ప్రశ్నించారు. సలహాలు ఇస్తే తీసుకోరని, ప్రతి దాడి చేస్తున్నారని అన్నారు. ప్రతిదానికీ ద్వంద్వార్థాలు తీయడం, టాపిక్‌ను డైవర్ట్ చేయడం మంచి సంస్కృతి కాదని బాలకృష్ణ హితవు పలికారు.