PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రూ. 100 కోట్ల స్థ‌లం ఆక్ర‌మ‌ణ.. టీజీ వెంక‌టేశ్ బంధువు పై కేసు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : హైద‌రాబాద్ లోని బంజారా హిల్స్ లో ఉద్రిక్త‌త చోటుచేసుకుంది. బంజారాహిల్స్‌ రోడ్‌ నం.10లోని సర్వే నంబరు 403లో రెండున్నర ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో ఈ స్థలాన్ని ఏపీ జెమ్స్‌ అండ్‌ జువెల్లరీ్‌సకు కేటాయించారు. ఆ సంస్థ నిర్వాహకులు ఒకటిన్నర ఎకరాల్లో నిర్మాణాలు చేపట్టారు. మిగతా స్థలం ఖాళీగానే ఉంది. సంస్థ భద్రతకు 10మంది దాకా సెక్యూరిటీ గార్డులను నియమించారు. హైదరాబాద్‌ పాతనగరానికి చెందిన వీవీఆర్‌ శర్మ అనేవ్యక్తి డాక్యుమెంట్లను చూపుతూ.. ఈ ఖాళీ స్థలం తమదేనంటూ ముందుకువచ్చారు. దీంతో ఈ స్థలంపై బంజారాహిల్స్‌ ఠాణాలో, కోర్టులో కేసులున్నాయి. ఈ క్రమంలో రెండున్నరేళ్ల క్రితం మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్‌ సోదరుడి కుమారుడు విశ్వప్రసాద్‌కు చెందిన కంపెనీతో ఆయన ఈ స్థలం విషయమై ఒప్పందం కుదుర్చుకున్నారు. అప్పటి నుంచి విశ్వప్రసాద్‌, అతని కంపెనీ ప్రతినిధులు పలుమార్లు ఆ స్థలంలో నిర్మాణాలు చేపట్టేందుకు యత్నించగా.. గార్డులు అడ్డుకున్నారు. దీంతో.. ఆదోనికి చెందిన కొందరు రాజకీయ ప్రముఖులను తన గ్రూపులో చేర్చుకుని.. ఆదివారం ఆ స్థలాన్ని ఆక్రమించాలని స్కెచ్‌ వేశారు.
కర్నూలు జిల్లా ఆదోని నుంచి కిరాయి గూండాలు, రౌడీలు, బౌన్సర్లను శనివారం రాత్రి నాలుగు ఎస్‌యూవీల్లో హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. వారివెంట భారీ ట్రక్కుల్లో రెడీమేడ్‌ గదులు(కంటైనర్లు), కార్యాలయాలను తీసుకువచ్చారు. ఆదివారం తెల్లవారుజామున వారంతా మారణాయుధాలతో స్థలం వద్దకు చేరుకున్నారు. ఎస్కవేటర్లతో ఏపీ జెమ్స్‌ అండ్‌ జ్యువెల్లరీస్‌ గేటును కూల్చివేశారు. లోపల ఉన్న పలు నిర్మాణాలను కూల్చివేశారు. అడ్డొచ్చిన గార్డులను చితకబాదారు. మారణాయుధాలతో దాడి చేశారు. ఆ వెంటనే రెడీమేడ్‌ గదులను అక్కడ స్థాపించారు. సమాచారం అందుకున్న బంజారాహిల్స్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో విశ్వప్రసాద్‌.. మరికొందరు పరారవ్వగా.. 62మందిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్‌ సహా.. నిందితులపై ఐపీసీలోని హత్యాయత్నం, అనుమతి లేకుండా ప్రైవేటు స్థలంలో ప్రవేశించడం, ఆస్తుల ధ్వంసానికి సంబంధించిన సెక్షన్లు, ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేశారు. 25మందికి పైగా పరారీలో ఉన్నారని, వారిలో ఆదోనికి చెందిన బడా రాజకీయనాయకులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

                                  

About Author