బ్యాంకుల సమ్మె.. సక్సెస్…
1 min readపల్లెవెలుగు వెబ్: గత 46 సంవత్సరాలుగా, దాదాపు 40 కోట్ల గ్రామీణ ప్రజలకు, 22000 శాఖల ద్వారా సేవలందిస్తున్న 43 గ్రామీణ బ్యాంకులు, దేశ ఆర్థిక రంగంలో తమ బాధ్యతను నిర్వహిస్తూనే, గత ఆర్థిక సంవత్సరంలో Rs3400/- కోట్ల లాభాలను సైతం ఆర్జించాయి. ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసి, పెట్టుబడి దారులకు స్వర్గధామంగా భారత ఆర్థిక రంగాన్ని తయారు చేసేందుకు, అన్ని కుట్రలు పన్నుతున్న కేంద్రంలోని బడాబాబులకు, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఒక బంగారు పళ్ళెంలా కనబడుతున్నాయి. 1976లో ప్రాంరంభించిన గ్రామీణ బ్యాంకులు, అన్ని రకాలుగా ప్రభుత్వాలనుంచి, స్పాన్సర్ బ్యాంకుల నుంచి, సవతి తల్లి బాధలు భరిస్తూనే, అన్ని అవరోధాలను అధిగమించి, ఒక శక్తివంతమైన ఆర్థిక సంస్థలుగా అవతరించాయి. బాలరిష్టాల్లో ఆదుకోనీ అపన్నహస్తలు, ఇప్పుడు గ్రామీణ బ్యాంకుల సర్వోన్నత స్థితిని చూసి, కబలించడానికి ముందుకు వస్తున్నాయి.
ఈ పరిస్థితులను ముందుగానే పసిగట్టిన కేంద్ర నాయకత్వం, గత రెండు నెలల ముందుగానే ఉద్యమ కార్యాచరణకు పిలుపు నిచ్చింది. 43 గ్రామీణ బ్యాంకులు ఏకతాటిపైకి వచ్చినా, 23.09.22 న దేశ వ్యాప్తంగా సమ్మె జరుగనుందని తెలిసినా, కన్నులుండి చూడలేని ధృతరాష్ట్రుల వలె 14.09.2022 నాడు కేంద్ర ప్రభుత్వం నిర్లజ్జగా, IPO కు మార్గదర్శకాలు విడుదల చేసింది.
ఈ నిరంకుశ ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజు, దేశవ్యాప్తంగా 43 గ్రామీణ బ్యాంకుల్లో పనిచేస్తున్న లక్ష మంది ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. అంతేకాకుండా దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈరోజు సమ్మె జరుగుతున్నది.
డిమాండ్లు
1. 43 గ్రామీణ బ్యాంకులతో జాతీయ గ్రామీణ బ్యాంకు ఏర్పాటు.
2. ప్రమోషన్ లలో, ట్రాన్సఫర్స్ ప్రక్రియలో, స్పాన్సర్ బ్యాంకు విధానాలను అవలంభించాలి.
3. మిత్ర కమిటీ ప్రకారం వెంటనే నియామకాలు చేపట్టాలి.
4. స్పాన్సర్ బ్యాంకు వ్యవస్థను రద్దు చేయాలి.
5. తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి.
6. 11వ వేతన సవరణను పూర్తిగా అమలు చేయాలి.
7. NPS ను రద్దు చేయాలి.
8. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పెన్షన్ అమలుచేయాలి
9. కారుణ్య నియామకాలు ఆగస్ట్2014 నుంచే అమలు చేయాలి.
దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా శుక్రవారం కర్నూలు లోని ప్రాంతీయ కార్యాలయం దగ్గర దాదాపు130 మంది తో ప్రదర్శన చేయడం జరిగింది. శ్రీ నాగరాజు, UFBU కన్వీనర్, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా, కామ్రేడ్ రోజరమని గారు, AIBEA జిల్లా అధ్యక్షురాలు, కా. రాముడు, కా. శివశంకర రెడ్డి, కా. శివ కృష్ణ, కా. నాగరాజు తమ మద్దత్తు తెలియచేసారు.
కామ్రేడ్ జంద్యాల రఘుబాబు, General Insurence, గ్రామీణ బ్యాంకుల గురించి “మా ఊరి బ్యాంకు” అంటూ చక్కని కవిత వినిపించారు. కామ్రేడ్ గౌస్ దేశాయ్ గారు, CITU జిల్లా కార్యదర్శి, ప్రధాన ప్రసంగం చేశారు. ప్రభుత్వ ఆర్థిక విధానాలు, ప్రైవేట్ వ్యక్తుల పన్నగాల గురించి వివరించారు. ఇక కా. R. రాము, కా. D.అజయ్ కుమార్, కా. N. రవితేజ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ అధికారుల సంఘం తరుపున, కా. E. హన్మంత రెడ్డి, G. మధుసూదన్ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఉద్యోగుల సంఘం తరుపున పాల్గొన్నారు.