రూ.50 లక్షలకు టోకరా..?
1 min read100 మంది గ్యాస్ సిలిండర్లను అమ్ముకున్న ఘనుడు.
లబ్ధిదారులు చెల్లించిన గ్యాస్ సొమ్ము స్వాహా.
పరారీలో నిందితుడు..ఆందోళనలో బాధితులు.
పోలీసులను ఆశ్రయించిన బాధితులు.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ఓ గ్యాస్ ఏజెన్సీ లో గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసే వడ్డేమాన్ కు చెందిన ఓ వ్యక్తి రూ.50 లక్షలతో ఉడాయించాడని సమాచారం. వ్యాపార నిమిత్తం వివిధ గ్రామాల ప్రజల నుంచి అప్పుగా తీసుకున్న డబ్బులు చెల్లించలేనని భావించి ఊరు వదిలి వెళ్లిపోయాడు.అలాగే 100 మందికి చెందిన గ్యాస్ సిలిండర్లు అమ్ముకోవడమే కాకుండా లబ్ధిదారులు గ్యాస్ కోసం చెల్లించిన సొమ్ము కూడా స్వాహా చేశాడని కొత్తగా సిలిండర్లు కొనుగోలు చేయాలంటే ఒక్కొక్కరికి దాదాపు రూ. 3500 అవుతుందని బాధితులు లబోదిబోమంటున్నారు. ఎలాగైనా తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వివరాలిలా ఉన్నాయి. నందికొట్కూరు మండలం వడ్డేమాన్ గ్రామానికి చెందిన ముస్లిం కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి వడ్డేమాన్ , కొనేటమ్మ పల్లి ,అల్లూరు , గ్రామాలలో ప్రజలకు నమ్మకంగా ఒక ఏజెన్సీ కి చెందిన గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తుండేవాడు. దాదాపు 100 మంది లబ్ధిదారులు ఉన్నారు.అలాగే ఆయా గ్రామాల ప్రజలకు అవసరమైన కూరగాయలు, కిరాణం సరుకులు సైతం సరఫరా చేస్తూ ప్రజలను నమ్మించాడు.ఆ నమ్మకమే ఆయా గ్రామాల ప్రజల కొంప ముంచింది. ప్రజలను నమ్మించి రూ.50 లక్షల తో ఉడాయించాడు. ఆయా గ్రామాల ప్రజలు గ్యాస్ బుకింగ్ కోసం చెల్లించిన సొమ్ముతో పాటు గ్యాస్ సిలిండర్లు సైతం అమ్ముకుని పరారయ్యాడు. పాఠశాల లో మధ్యాహ్నం భోజనం తయారు చేయడానికి ఉపయోగించే సిలిండర్లు కూడా అమ్ముకున్నాడు. రాత్రికి రాత్రి కుటుంబ సభ్యులతో పరారయ్యాడని విషయం తెలుసుకున్న గ్రామస్తులు బ్రాహ్మణకొట్కూరు పోలీసులను ఆశ్రయించారు. గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులకు ఫిర్యాదు చేసిన స్పందించడం లేదని తమకు ఎలాంటి సంబంధం లేదంటున్నారని తెలిపారు. తమకు న్యాయం చేయాలని కోరారు. బాధితులు మాట్లాడుతూ ఓ వ్యాపారం నిర్వహణకు ప్రజల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నాడని దీంతో పాటు చేతి బదులు రూపంలో కూడా అప్పు చేశాడని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. పోలీసులు అతని కోసం గాలిస్తున్నట్లు సమాచారం.