హై-టెక్ ప్రకృతి వ్యవసాయం అభినందనీయం
1 min read
ఏలూరు జిల్లాలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రశంసించిన జర్మనీ ప్రతినిధి బృందం
పల్లెవెలుగు ,ఏలూరుజిల్లా ప్రతినిధి: ప్రకృతి వ్యవసాయం మరియు రసాయన వ్యవసాయ మధ్య గల వ్యత్యాసాలు నిజంగా ఆశ్చర్యకరంగా ఉన్నాయని, ప్రకృతి వ్యవసాయ విధానాలు అధిక ప్రయోజనాలను స్పష్టంగా ప్రదర్శిస్తున్నాయని జర్మన్ ప్రతినిధి బృందం ప్రశంసించింది. జర్మన్ ప్రతినిధి బృందం రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న తమ 5 రోజుల పర్యటనలో భాగంగా మూడో రోజు ఏలూరు జిల్లా, ఏలూరు మండలం, వెంకటా పురం గ్రామంలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను పర్యటించి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పరిశీలించింది. ముందుగా బృంద సభ్యులు టి. జ్యోతి పొలంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో అనుసరిస్తున్న ఏ-గ్రేడ్ వరి మోడల్ తో పాటు కాంపాక్ట్ బ్లాకులను కూడా పరిశీలించారు. ఈ బృందం ఈ పర్యటనలో ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ (పీఎండీఎస్), వరి ఏ-గ్రేడ్ మోడల్ నిర్మాణం, వారి పంటలో గట్ల విస్తరణ ద్వారా పలు పంటలు పండించడం, పంటల నుంచి వచ్చే దిగుబడులు, ఆదాయం, దేశీయ విత్తనాల వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించుకొంది. ఈ సంధర్భంగా కోడిగుడ్డు నిమ్మరస ద్రావణం, పుల్లటి మజ్జిగ మరియు వేప గింజల కాషాయం వంటి బయో-ఇన్పుట్లను వరి పొలాలపై పిచికారీ చేయడానికి డ్రోన్లను ఉపయోగించిన తీరు ప్రత్యేకంగా ఆకట్టుకుందని బృందంలోని మరో సభ్యుడు లుకాస్ “హై-టెక్ ప్రకృతి వ్యవసాయం” గా అభివర్ణించారు. అనంతరం తమ భవిష్యత్ ప్రణాళికల గురించి లుకాస్ మాట్లాడుతూ “జర్మనీలో వ్యవసాయ పర్యావరణ పరిశోధన మరియు శిక్షణ కేంద్రం ను స్థాపించడానికి ప్రయత్నిస్తున్నామని, గత సంవత్సరం ఏపీసీఎన్ఎఫ్ (ఆంధ్ర ప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం) కార్యక్రమం సందర్శించడం నాకు గౌరవనీయంగా ఉందని, ఈ విధానం నిజంగా స్ఫూర్తిదాయకం అని కొనియాడారు. సాధారణంగా జర్మనీ మరియు ఐరోపాలో ఇలాంటి ప్రాజెక్టులు చిన్నవిగా ఉంటాయని, కేవలం ఇద్దరు లేదా ముగ్గురు రైతులు మాత్రమే ఇలాంటి విధానం అనుసరిస్తారని, కానీ ఆంధ్ర ప్రదేశ్ రైతులు అత్యధిక సంఖ్యలో అధిక విస్తీర్ణంలో చేయడం అభినందనీయం అని అన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని మ దేశంలో పెద్ద ఎత్తున అనుసరించాలని లక్ష్యంగా ఎంచుకొన్నట్లు తెలిపారు.అనంతరం ప్రతినిధి బృందం ఏలూరు మండలం ఆడమిల్లి గ్రామంలో శ్రీమతి ఎస్.కె.నవీన్షా పొలంలో ఏటీఎం (ఎనీ టైమ్ మనీ) మోడల్ ను సందర్శించి ప్రకృతి వ్యవసాయం యొక్క సుస్థిరత మరియు లాభదాయకతను తెలుసుకున్నారు. జర్మనీ, యూరప్ దేశాల్లో పెద్ద ఎత్తున ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలన్న తమ నిబద్ధతను ఈ పర్యటన బలపరుస్తుందని అభిప్రాయపడ్డారు.
