సెకండ్ వేవ్..తో జాగ్రత్త..!
1 min readకోవిడ్ లక్షణాల్లో మార్పు..
– సీనియర్ పిజిషియన్ డా. భవాని ప్రసాద్
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: కోవిడ్ తో.. మనం జాగ్రత్తగా ఉంటే… మన కుటుంబం.. సమాజాన్ని కూడా కాపాడిన వారమవుతామని సీనియర్ పిజిషియన్ డా. భవాని ప్రసాద్ ఉద్బోధించారు. సంపూర్ణ ఆరోగ్యం కోరుకునే వారు… కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని, లేదంటే వైరస్ బారిన పడే ప్రమాదం ఉందని సూచించారు. ఆదివారం సాయంత్రం ఏ క్యాంపులోని కర్నూలు హార్ట్ ఫౌండేషన్ హాల్లో కోవిడ్’ వైరస్ సోకకుండా.. ఆరోగ్యంగా ఉండాలంటే… తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారం తదితర అంశాలను డా. భవాని ప్రసాద్ వివరించారు. హార్ట్ ఫౌండేషన్ సెక్రటరి డా. చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన కోవిడ్ అవగాహన సదస్సులో ప్రముఖులు, వైద్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా. భవాని ప్రసాద్ మాట్లాడుతూ కోవిడ్ సెకండ్ వేవ్ లక్షణాల్లో మార్పు ఉన్నాయన్నారు. కీళ్లనొప్పులు, అలసట, ఆయాసం, శరీర భాగాల నొప్పి రావడం వంటివి కోవిడ్ సెకండ్ వేవ్ లక్షణాలు అని, వాటిని గుర్తించిన వెంటనే ప్రముఖ వైద్యులను సంప్రదించాలని సూచించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా.. మనదేశంలోనూ రోజుకు వేల సంఖ్యలో పాజిటి కేసులు పెరుగుతున్నాయని, ఏపీలో వెయ్యికి పైగా వస్తున్నాయన్నారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభించకముందే.. జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతిఒక్కరూ మాస్కు ధరించి, శానిటైజరు ఉపయోగించాలన్నారు. భౌతిక దూరం పాటించకపోతే ముప్పు తప్పదన్నారు. అనంతరం సీనియర్ పిజిషియన్ డా. భవాని ప్రసాద్‌ను హార్ట్ ఫౌండేషన్ సెక్రటరి డా. చంద్రశేఖర్, సభ్యులు శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో కర్నూలు హార్ట్ ఫౌండేషన్ సభ్యులు, వైద్యసిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.