ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే.. RRR పై అక్రమ కేసు
1 min read– బీజేపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా కార్యదర్శి ఆనంద గజపతిరాజు
పల్లెవెలుగువెబ్, రాయచోటి : ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించినందుకు.. టీటీడీ ఆస్తులు అక్రమ విక్రయాలు అడ్డుకున్నందుకే నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అక్రమ కేసులు బనాయించారని బీజేపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా కార్యదర్శి ఆనంద గజపతిరాజు ఆరోపించారు. ముఖ్యంగా సీఎం జగన్ బెయిల్ పిటిషన్ రద్దు పై కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేయడం భరించలేని ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆనంద గజపతి రాజు మాట్లాడారు. టీటీడీ దేవస్థాన భూములను అమ్మడానికి ప్రయత్నించడం, అక్రమ చర్చిల నిర్మాణాలు, చర్చిలకు ప్రభుత్వ నిధుల కేటాయింపులు తదితర అంశాలను ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారని, వాటికి సమాధానం చెప్పలేని సీఎం జగన్… సీఐటీ పోలీసులతో అరెస్టు చేయించి.. కొట్టించడం దారుణమన్నారు. రాయచోటిలో కుల రాజకీయాలు చేసి క్షత్రీయుల ఓట్లు వేయించుకున్న ఓ వైసీపీ నేత… అధినాయకుల మెప్పు కోసం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని బీజేపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా కార్యదర్శి ఆనంద గజపతిరాజు ఎద్దేవ చేశారు.