21న తితిదే ఆధ్వర్యంలో భగవద్గీత కంఠస్థ పఠన పోటీలు
1 min read– విద్యార్ధుల్లో సృజనాత్మకతను పెంపెందించుటకే భగవద్గీత కంఠస్థ పఠన పోటీలు
– డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తితిదే
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: విద్యార్ధులలో సృజనాత్మకతను పెంపొందించుటతో పాటు జీవితంలో ఎదురయ్యే అనేక సవాళ్ళను ఎదుర్కొనే శక్తిని సముపార్జించుటకు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గీతా జయంతి సందర్భంగా భగవద్గీతల కంఠస్థ పఠన పోటీలు నిర్వహిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం కర్నూలు పట్టణం, ఎన్.ఆర్.పేట లోని శ్రీగీతా ప్రచార ధామంలో గీతా ప్రచార సంఘం అధ్యక్షులు డి.వి.రమణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన కరపత్రాలను వివిధ ధార్మిక సంస్థల ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. 6-7 తరగతులకు ఒక విభాగంగా, 8-9- తరగతులకు మరో విభాగంగా, భగవద్గీత మొత్తం నేర్చుకున్న వారికి 18 సంవత్సరాలలోపు విద్యార్థులకు ఒక విభాగంగా, 18 సంవత్సరాలు పైబడిన వారికి ఒక విభాగంగా మొత్తం నాలుగు విభాగాలుగా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గెలుపొందిన నాలుగు విభాగాల వారికి ప్రధమ, ద్వితీయ, తృతీయ, వరుసగా రూ.1000-00, 750-00, 500-00 అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలు తిరుమల తిరుపతి దేవస్థానములు నిర్వహించడం అభినందనీయ మని పలు ధార్మిక సంస్థల ప్రతినిధులు అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు గోరంట్ల రమణ, డి.ఎస్.పి.భాష, ఇస్కాన్ ధర్మ ప్రచారకులు రఘునందన సేవక్ దాస్, ధర్మప్రచార మండలి సభ్యులు మేడా సుబ్రహ్మణ్యం స్వామి, మారం నాగరాజు గుప్త, అనంత అనిల్, పసుపులేటి నీలిమ, దాసరి రామచంద్రారెడ్డి, ఇ.వెంకట రమణ, ఎస్.రమేశ్, యం.అనిల్, ప్రభుత్వ వైద్య కళాశాల శాఖాధిపతి డాక్టర్ చిట్టి నరసమ్మ,ఇందిర, రామాయణం ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.