అతిపెద్ద బ్యాంకు మోసం.. రూ. 22,842 కోట్ల కుచ్చుటోపి !
1 min readపల్లెవెలుగువెబ్ : ఏబీజీ షిప్ యార్డ్ సంస్థ పెద్ద ఎత్తున రుణ ఎగవేతకు పాల్పడింది. అక్షరాలా రూ.22,842 కోట్లు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం నుంచి వ్యాపారం కోసం రుణాలుగా తీసుకున్నారు. చెల్లించకుండా ఇప్పుడు చేతులెత్తేశారు. దీనిని సీబీఐ ఇప్పటిదాకా నమోదు చేసిన బ్యాంకు మోసాల్లో అతి పెద్దదిగా భావిస్తున్నారు. నిధులు మింగేసిన ఏబీజీ షిప్‌యార్డ్ లిమిటెడ్ (ఏబీజీఎస్‌ఎల్), ఆ సంస్థ మాజీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రిషి కమలేశ్ అగర్వాల్‌తో పాటు ఇతరులపై కేసు నమోదు చేసినట్లు సీబీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది. సంస్థ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతానం ముత్తస్వామి, డైరెక్టర్లు అశ్వినీ కుమార్, సుశీల్‌కుమార్ అగర్వాల్, రవి విమల్ నెవెతియాతో పాటు మరో సంస్థ ఏబీజీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌పైనా పలు ఐపీసీ సెక్షన్లు, అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పింది.