దేశంలో బిజెపి పరిపాలన ప్రపంచానికే మార్గదర్శకం
1 min read– రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తున్న పరిపాలన ప్రపంచానికి ఆదర్శప్రాయంగా సాగుతుందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. బిజెపి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయం వద్ద పార్టీ జెండాను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆవిష్కరించారు .ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు రామస్వామి తో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ 1952లో శ్యాంప్రకాష్ ముఖర్జీ స్థాపించిన జన సంఘ ఆ తర్వాత భారతీయ జనతా పార్టీగా మార్పు చెందిందని వివరించారు. భారతీయ జనతా పార్టీ వెనుక ఎన్నో త్యాగాల చరిత్ర ఉందని ఆయన వివరించారు. బిజెపి వ్యవస్థాపకులు శ్యా మ్ ప్రకాష్ ముఖర్జీ చనిపోవడానికి కారణాలు ఇప్పటివరకు తెలియ రాలేదని ఆయన వివరించారు.ఎందరో మహనీయుల త్యాగాలతో భారతీయ జనతా పార్టీ అంచలంచలుగా ఎదిగి ప్రస్తుతం దేశాన్ని పరిపాలిస్తుందని ఆయన వివరించారు. కేంద్రంలో బిజెపి పరిపాలన ప్రపంచానికే మార్గదర్శనమని వివరించారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే కొంతమంది బిజెపి మెజార్టీ వర్గానికి కొమ్ము కాస్తుందని దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. దేశంలో మైనార్టీలకు రాజ్యాంగపరంగా హక్కులు ఉన్నాయని, వారి హక్కులను కాపాడుతూనే మెజార్టీ వర్గం లో బాధితులుగా ఉన్నవారి కి హక్కులు కల్పిస్తూ ముందుకు సాగుతుందని వివరించారు .ఇదే సమయంలో మైనార్టీలకు రాజ్యాంగపరంగా ఉన్న హక్కులకు ఎలాంటి భంగం లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు .ప్రపంచంలో సరైన నాయకత్వం లేమి కారణంగా శ్రీలంక ,ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లాంటి దేశాలు ఆర్థికంగా పతనమైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 140 కోట్ల జనాభా ఉన్నప్పటికీ మన దేశంలో బిజెపి ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారధ్యంలో చక్కటి పరిపాలన అందించడంతోపాటు ప్రపంచంలో ఆకలితో అలమటిస్తున్న వారి ఆకలి తీరుస్తున్నారని వివరించారు.