NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రైతాంగాన్ని ఆదుకోవడంలో బిజెపి ప్రభుత్వం విఫలం…

1 min read

డాక్టర్ స్వామినాథన్ కమీషన్ సిఫారసులను అమలు చేయాలి.

అంబానీ, ఆదానిల కు ఊడిగం చేస్తున్న మోడీ.

ఈనెల 16 న రైతాంగ,కార్మిక సంఘాలు తలపెట్టిన గ్రామీణ బంద్ కు సిపిఐ సంపూర్ణ మద్దతు… సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ.

విలేకరుల సమావేశంలో  సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ.

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: రైతాంగాన్ని ఆదుకోవడంలో బిజెపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ విమర్శించారు. మంగళవారం కర్నూలు జిల్లా పత్తికొండ చదువుల రామయ్య భవనంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి. రామచంద్రయ్య సిపిఐ పత్తికొండ మండల కార్యదర్శి డి రాజా సాహెబ్ తో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మోడీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వ రంగ సంస్థలను అంబానీ, ఆదానీలకు అప్పనంగా అప్పగిస్తూ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నారన్నారని తెలిపారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ఈ సందర్భంగా కోరారు. పంట పెట్టుబడికి రైతులు తీసుకున్న బ్యాంకు  రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలన్నారు.  సీఎం జగన్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో వైసిపి గెలుస్తుందని ప్రగల్బాలు పలుకుతూ, మంత్రులు, ఎమ్మెల్యేలు, పోటీ చేసే అసెంబ్లీ నియోజకవర్గ, పార్లమెంట్ స్థానాలను మార్పులు చేయడాన్ని వారు తప్పుపట్టారు. మోడీ,జగన్ మోహన్ రెడ్డి దురహంకార పాలనకు చరమగీతం పాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈనెల 16న తలపెట్టిన గ్రామీణ బంద్ కు సిపిఐ సంపూర్ణ సహకారం అందిస్తుందని,  గ్రామీణ రైతులు, వ్యవసాయ కూలీలు, పట్టణ కార్మిక, కర్షకులు, మహిళలు, విద్యార్థి, యువజన సంఘాలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో  ఉమ్మడి కర్నూలు జిల్లా సిపిఐ మాజీ జిల్లా కార్యదర్శి భీమ లింగప్ప,, పట్టణ కార్యదర్శి రామాంజనేయులు, ఏపీ రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్షులు పెద్ద వీరన్న, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు గురుదాస్ ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కారుమంచి నియోజక అధ్యక్షులు పెద్దయ్య సిపిఐ జిల్లా సమితి ఎం కారన్న ఎఐటియుసి నియోజకవర్గ అధ్యక్షులు నెట్టికంటయ్య సభ్యులు పాల్గొన్నారు.

About Author