ఆశీర్వదించండి.. శభాష్ అనేలా పనిచేస్తాం..
1 min readఎవరికి ఏ కష్టం వచ్చినా అర్ధరాత్రి అయినా ఆదుకుంటా
ఏలూరు పార్లమెంట్ అభ్యర్ధి పుట్టా మహేష్
రాష్ట్ర ప్రజల భవిష్యత్తు మార్పు కోసమే కూటమి కలయిక
అసెంబ్లీ అభ్యర్ధి బడేటి చంటి స్పష్టీకరణ
కూటమి విస్తృతస్థాయి ఆత్మీయ సమావేశం
పెద్ద ఎత్తున పాల్గొన్న జనసేన, బిజెపి, టిడిపి శ్రేణులు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు పార్లమెంట్, అసెంబ్లీ ప్రజలు, పార్టీ అధినేత చంద్రబాబు శభాష్ అనేలా పనిచేస్తామని, అందరి సహకారంతో జిల్లాను ఏలూరును అభివృద్ధిపథంలో నడిపిస్తామని ఏలూరు పార్లమెంట్ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్ధి పుట్టా మహేష్ కుమార్ యాదవ్, ఏలూరు అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్ధి బడేటి చంటి స్పష్టం చేశారు. ఏలూరులోని టుబాకో మర్చంట్స్ కళ్యాణ మండపంలో ఆదివారం టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల విస్తృత స్థాయి ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపి అభ్యర్ధి పుట్టా మహేష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ తాను స్థానికంగానే ఉంటానని, ఎవరికి ఏ కష్టం వచ్చినా, అర్థరాత్రి అయినా ఆదుకుంటానని హామీ ఇచ్చారు. సైకో జగన్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కేవలం ధనార్జనే ధ్యేయంగా పెట్టుకున్న జగన్ ప్రజల ఆస్తులపై కన్నేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి చేయకుండా ఐదేళ్ళపాటు కాలయాపన చేసిన జగన్మోహన్ రెడ్డి జే ట్యాక్స్ మాత్రం వసూలు చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రతి ఒక్కరూ ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఏ ఒక్కరూ కూడా మనశ్శాంతితో జీవించే పరిస్థితులు లేకుండా వైసీపీ ప్రభుత్వం చేసిందని మండిపడ్డారు. విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు అని, ఆయన సారధ్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలంటే ఎన్డీఏ కూటమిని గెలిపించాలని కోరారు. ఏలూరు అసెంబ్లీ అభ్యర్ధి బడేటి చంటి మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో కూటమి విజయానికి ప్రతిఒక్కరూ పెద్దన్న పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఎటువంటి అపోహలు, మనస్ఫర్థలకు తావు ఇవ్వకుండా కలసికట్టుగా పనిచేస్తే ప్రజలు ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్ర ప్రజలు భవిష్యత్తు మార్పు కోసమేల కూటమి కలయిక జరిగిందన్న విషయాన్ని ప్రజలు గుర్తించారని, ఇప్పటికే కూటమి విజయం వన్ సైడ్ అయిపోయిందని చెప్పారు. ఇప్పటివరకు పడిన కష్టానికి అనుకున్న ప్రతిఫలం లభించాలంటే ఈ ముప్పై రోజుల పాటు అప్రమత్తంగా ఉండి, ప్రజలతో మమేకం కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు మధ్యాహ్నపు బలరాం, దాసరి ఆంజనేయులు, చోడే వేంకటరత్నం, పూజారి నిరంజన్, ఉప్పాల జగదీష్ బాబు, జనసేన నాయకులు బివి రాఘవయ్య చౌదరి, నగిరెడ్డి కాశీనరేష్, బీజేపీ నాయకులు కురాళ్ళ సుధాకర్ కృష్ణ, నాగం శివ, ముద్దాని దుర్గారావు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.