9 మంది తల సేమియా చిన్నారులకు రక్తమార్పిడి
1 min read– ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రక్తదానం చేయాలి
– చైర్మన్ బీవీ కృష్ణారెడ్డి
– గ్రంధి అమరేంద్రనాథ్ కు అభినందనలు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ప్రభుత్వ బోధనా ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో తల సేమియా భవనంలో 9 మంది తల సేమియా చిన్నారులకు రక్తమార్పిడిని నిర్వహించినట్లు జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బీవీ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ వేసవి కాలంలో రక్తదాతల కొరత ఎక్కువగా ఉంటుందని, తల సేమియా చిన్నారులు సకాలంలో రక్తం అందగా ఇబ్బంది పడుతున్నారని, కాబట్టి ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా రక్తదానం చేసి తల సేమియా చిన్నారులను ఆదుకోవాలని కోరారు. డాక్టర్ ఆర్ ఎస్ ఆర్ కె వరప్రసాద్ రావు మాట్లాడుతూ రక్తాన్ని కుత్రిమంగా సృష్టించలేమని కేవలం మనిషి నుండి రక్తాన్ని సేకరించడం ద్వారానే ఇతరులకు ప్రాణదానం చేయగలమని. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయటం వలన ఏ విధమైన ఇబ్బందులు తలెత్తవని. రక్త కణాలు ప్రతి మూడు నాలుగు నెలలకు ఒకసారి నిర్జీవం అయ్యి మరల కొత్త కణాలు పుట్టుకొస్తాయని వివరించారు. తల సేమియా చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులకు 30 మందికి ఉచిత భోజనం ఏర్పాటు చేసిన వైభవ్ జువెలరీస్ అధినేత గ్రంధి వెంకట అమరేంద్రకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ కార్యదర్శి బి. బెన్నీ, డాక్టర్ ఆర్ ఎస్ ఆర్ కె వరప్రసాదరావు, ట్రెజరర్ రేవూరి శివప్రసాద్, గ్రంధి అంబిక మరియు రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు.