తప్పని నిరూపిస్తే వెనక్కి ఇచ్చేస్తా: కంగనా
1 min read
పల్లెవెలుగు వెబ్: సంచలనాలు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. దేశ స్వాంతంత్ర్యంపై ఆమె చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చింది 2014లో అని.. 1947లో వచ్చింది భిక్ష మాత్రమేనని కంగనా ఇటీవల ఓ ఇంటర్య్వూలో చెప్పింది. దీంతో ఆమెను అరెస్ట్ చేయాలన్న డిమాండ్ వచ్చింది. ఆమె వ్యాఖ్యలు స్వాతంత్ర్య సమరయోధులను అవమానించడమేనని పలువురు అభిప్రాయపడ్డారు.
ఈ అంశంపై తాజాగా మరోసారి కంగనా స్పందించారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేసింది. ‘నేను చేసిన వ్యాఖ్యలు తప్పని నిరూపిస్తే… పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేసి.. తప్పైందని క్షమాపణ కోరతా’. అని కంగనా ఇన్‌స్టా స్టోరీస్‌లో రాసుకొచ్చింది. అలాగే ‘జస్ట్ టు సెట్ ది రికార్డ్స్ స్ట్రేట్’ అనే పుస్తకంలోని పేజీలను షేర్ చేస్తూ.. 1857లో తొలిసారిగా స్వాతంత్ర్యం కోసం ఉమ్మడి పోరాటం జరిగిందని.. సుభాష్ చంద్రబోస్, రాణి లక్ష్మీబాయి, వీర్ సావర్కర్ లాంటి వారు తమ ప్రాణాలను త్యాగం చేశారని పేర్కొంది.
‘1857లో జరిగిన తొలి స్వాతంత్ర్య పోరాటంపై విస్తృత పరిశోధన చేశాను. అప్పుడు ఉన్న జాతీయవాదం తరువాత కాలంలో ఒక్కసారిగా ఎందుకు తగ్గింది? భగత్‌సింగ్, నేతాజీ బోస్ లాంటి నేతలు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? గాంధీ కొందరికి మాత్రమే మద్దతు ఎందుకు ఇచ్చారు?స్వాతంత్ర్యాన్ని సంబంరంగా చేసుకోకుండా భారతీయులే చంపుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? వీటికి నేను సమాధానం తెలుసుకోవాలనుకుంటున్నాను.’ అని కంగనా ఇన్ స్టా వేదికగా ప్రశ్నించింది. 1947లో అసలేం జరిగిందో ఎవరైనా తనకు వివరిస్తే…తప్పకుండా తన పద్మశ్రీని వెనక్కి ఇచ్చేస్తానని కంగనా స్పష్టం చేసింది. ఎడిట్ చేసిన వీడియో క్లిప్‌లను వైరల్ చేసి విమర్శలు చేయడం కాదని… మొత్తం ఎపిసోడ్ చూపించి మాట్లాడాలని హితవు పలికింది. తానెప్పుడు నిజాలు మాట్లాడటానికి భయపడనని.. ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటానని కంగనా ఇన్‌స్టాలో రాసుకొచ్చింది.