PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రాజెక్టులను అడ్డుకున్న సీమ ద్రోహి చంద్రబాబు…

1 min read

– సీమకు అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు.

– నందికొట్కూరు  ఎమ్మెల్యే తొగురు ఆర్థర్.

– రాయలసీమ గురించి మాట్లాడే అర్హత బాబుకు లేదు.

– పూర్తి చేసిన ఒక్క ప్రాజెక్టు పేరైనా బాబు చెప్పగలడా.?

– చంద్రబాబు హయాంలో ఏ ఒక్క  ప్రాజెక్టు చేపట్టలేదు.

– హంద్రీ నీవా, గాలేరు నగరి పూర్తి వైయస్సార్‌ పుణ్యమే.

– ఉమ్మడి రాష్ట్రంలో ఇరిగేషన్‌ ప్రాజెక్టుల రూపకర్త వైఎస్సార్.

– పోతిరెడ్డిపాడును ఒకటిన్నర ఏళ్లలోనే పూర్తి చేశారు.

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  రాయలసీమ ప్రాజెక్ట్ గురించి ఏ రోజు మాట్లాడని వ్యక్తి ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టుల సందర్శన పేరుతో  పర్యటన చేస్తూ ప్రాజెక్టుల  గురించి మాట్లాడడం విడ్డురంగా వుందని  గాలేరు -నగరి, హంద్రీ- నీవా ప్రాజెక్టులను పదేళ్ల పాలనలో టిడిపి నిర్లక్ష్యం చేయడం వలన నాడు రైతులు నష్ట  పోయింది వాస్తవం కదా అని నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ అన్నారు.బుధవారం నందికొట్కూరు పట్టణంలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్థర్ మాట్లాడుతూ   తెలుగుగంగ 1984 లో రూప కల్పన చేస్తే సుదీర్ఘ కాలంలో రూ. 1700 కోట్లు ఖర్చు చేస్తే 2004 – 2009 మధ్య కాలంలో రూ.  2500 కోట్లు వైఎస్ అర్ ఖర్చు చేశారని పేర్కొన్నారు. వెలిగొండ, తెలుగు గంగ పనులు పూర్తి చేసి నీళ్ళు ఇచ్చిన ఘనత దివంగత నేత వైయస్ రాజశేఖరరెడ్డి దేనన్నారు.గాలేరు- నగరి, హంద్రీనీవా ప్రాజెక్టు కు ఒక్క పైసా కూడా టిడిపి హాయాంలో ఖర్చు పెట్టలేదన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే రాయలసీమ ప్రాజెక్టుల కోసం 5,600 కోట్లు ఖర్చు చేశాడని తెలిపారు. ప్రాజెక్టులు వద్దన్న చంద్రబాబు తిరిగి ప్రాజెక్టుల సందర్శన అనడం హాస్యాస్పదమని ఎద్దేవాచేశారు. రాయలసీమ కు ఉపయోగ పడే ప్రాజెక్ట్ లను గాలికి వదిలేసి చంద్రబాబు ద్రోహం చేశారని ఆరోపించారు. ఇందుకు చంద్రబాబు రాయలసీమ ప్రజలకు క్షమాపణ చెప్పాలి..వ్యవసాయం దండగ అని చెప్పిన చంద్ర బాబు వైసిపిని విమర్శించే అర్హత లేదన్నారు.అబద్ధాలు చెప్పడంతో చంద్రబాబు దిట్ట..కన్నార్పకుండా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబును మించిన నాయకుడు లేడు. సత్యదూరమైన, నిజాయితీ లేనటువంటి మాటలను అప్పటికప్పుడు అల్లి చెప్పడం చంద్రబాబు నైజమని విమర్శించారు . రాయలసీమ అభివృద్ధికి సీఎం  వైయస్‌ జగన్‌ కంటే, తానే ఎక్కువ చేశానని చెప్పుకోవడానికి చంద్రబాబుకు ఏ మాత్రమైనా సిగ్గుందా అని ప్రశ్నించారు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన విషయాని, మూడు సార్లు అధికారం నుంచి దిగిపోయానన్న సంగతినీ ఆయన మర్చిపోయారన్నారు.

రైతులను నట్టేట ముంచిన ఘనుడు..

వ్యవసాయం దండగ అనడమే కాకుండా, ఆ విషయాని పుస్తకంలో కూడా రాసిన వ్యక్తి  ఈరోజు వ్యవసాయం గురించి మాట్లాడడం నవ్వు వస్తుందన్నారు. రాయలసీమలో ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా రైతులతో ప్రకాశం బ్యారేజీపై ధర్నా చేయించిన చంద్రబాబు, ఈరోజు ఇరిగేషన్‌పై మాట్లాడడం హాస్యాస్పదం. వ్యవసాయం, రైతులు పట్ల పూర్తి నిర్లక్ష్యం చూపిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు  . రైతులకు రుణమాఫీ చేస్తానని మోసం చేసిన దగ్గర్నుంచి ఏ ఒక్కటీ చేయకపోగా.. వాళ్లను బాబు ఎంతగా ముంచాడో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఒక్కరికీ తెలుసన్నారు.

అన్నీ ఒట్టి మాటలు..

ఇరిగేషన్‌ రంగంలో ఎంతో చేశానంటున్న చంద్రబాబు, రాయలసీమ వాసులకు ఏమీ తెలియదని అనుకుంటున్నాడని  అందుకే వారిని మాయ మాటలతో మభ్య పెట్టాలని చూస్తున్నాడని ఆరోపించారు. టీడీపీ అధికారం చేపట్టిన తర్వాత  ప్రాజెక్టులపై చేసిందేమీ లేదన్నారు. కానీ సీమ ప్రజలను మోసగించే ఎత్తుగడలో భాగంగా ఉరవకొండ దగ్గర 40 టీఎంసీల నీటికి సంబంధించి హంద్రీనీవాకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 1999లో అక్కడ 40 టీఎంసీల సామర్థ్యం కుదరదంటూ.. కేవలం 5 టీఎంసీల ప్రాజెక్టు చేపడతామంటూ జీఓ జారీ చేసి.. మరోసారి శంకుస్థాపన చేశారు. కానీ 2004 వరకు కనీసం పనులు కూడా మొదలు పెట్టలేదు. చివరకు శిలాఫలకం వేసిన వారికి కూడా డబ్బులివ్వలేదు. అదీ హంద్రీనీవాకు సంబంధించి చంద్రబాబు ఘనత అని దుయ్యబట్టారు. గాలేరు–నగరిపై కూడా ఏ మాత్రం శ్రద్ధ చూపకపోగా, గండికోట రిజర్వాయర్‌ ఉండగా అక్కడ కేవలం 1 టీఎంసీ సామర్ధ్యం  ప్రాజెక్టు సరిపోతుందని జీవో ఇచ్చాడు. అలాంటి పెద్దమనిషి ఇవాళ రాయలసీమ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నాడు. ఇరిగేషన్‌పై ఉత్త కబుర్లు చెబుతున్నాడని మండిపడ్డారు. 

అవి పూర్తి చేసింది వైయస్సార్‌.

2004లో నాడు ఉమ్మడి రాష్ట్రంలో సీఎం అయిన వైయస్సార్‌ హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తి చేశారు. అక్కడ 5 టీఎంసీల ప్రాజెక్టుపై చంద్రబాబు జారీ చేసిన జీఓను రద్దు చేసిన ఆయన, అక్కడే పనులు చేపట్టి పూర్తి చేశారన్నారు. అదే విధంగా గాలేరు–నగరి ప్రాజెక్టులో మొదటి విడత పనులు వైయస్సార్‌  హయాంలో యుద్ధప్రాతిపదికన జరిగాయని పేర్కొన్నారు.  ఒకటిన్నర ఏళ్లలో పోతిరెడ్డిపాడు.

రాయలసీమ ప్రజలు గర్వంగా చెప్పుకునే పోతిరెడ్డిపాడు రిజర్వాయర్‌ను గతంలో విజయభాస్కర్‌రెడ్డిగారు సీఎంగా ఉన్నప్పుడు 11వేల క్యూసెక్కుల స్థాయిలో శంకుస్థాపన చేస్తే.. దాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచడమే కాకుండా  కేవలం ఒకటిన్నర ఏళ్లలోనే ఆ పనులు పూర్తి చేసిన వైయస్సార్‌గారు రికార్డు సృష్టించారన్నారు.

బాబుకు మాట్లాడే హక్కు లేదు:

రాయలసీమ ప్రాంత అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు. 1995లో అధికారపగ్గాలు చేపట్టిన దగ్గర్నుంచి హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్టు పనులు చేపట్టకపోగా, పోతిరెడ్డిపాడు పనులు చేస్తుంటే బాబు వ్యతిరేక భావాలతో కొందరిని రెచ్చగొట్టి నిరసన కార్యక్రమాలు చేయించాడు. అంత నీచమైన స్వభావమున్న బాబు ఈరోజు రాయలసీమ అభివృద్ధి, ప్రాజెక్టులపై మాట్లాడటం ఆయన సిగ్గుమాలినతనానికి నిదర్శనం.

సొంత జిల్లాకు నీళ్లు ఇవ్వలేని వ్యక్తి ..

కుప్పంకు కూడా నీళ్లు ఇవ్వలేని వ్యక్తివి నువ్వు.. రాయలసీమకు ఏదో చేశానని గొప్పలు చెప్పుకుంటున్నావే! నువ్వు పూర్తి చేసిన ఒక్క ప్రాజెక్టు పేరునైనా చెప్పగలవా..? అని బాబుకు సవాల్‌ విసురుతున్నాను.  రాయలసీమపై ఉన్న ధ్వేషంతో బాబు ఇక్కడ ఏ పనీ చేపట్టకపోగా ఈరోజు అబద్ధాలతో ప్రజల్ని మోసం చేయాలనుకోవడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ డైరెక్టర్  గంగిరెడ్డి రమాదేవి , రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్  హాజీ అబ్దుల్ షుకూర్ , మున్సిపల్ వైస్ చైర్మన్  మొల్ల రబ్బాని ,వైసీపీ నాయకులు  ఉండవల్లి ధర్మారెడ్డి , మొల్ల జాకీర్ హుస్సేన్ , నందికొట్కూరు సింగిల్ విండో చైర్మన్  సగినేల హుస్సేనయ్య ,  పట్టణ మహిళా ప్రధాన కార్యదర్శి డాక్టర్ వనజ , వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author