బ్రెయిన్ డెడ్ మహిళ.. అవయవాల దానం..
1 min readచనిపోయినా… బతికి ఉన్నట్లే…
- కర్నూలు కలెక్టర్ జి.సృజన
- బాధిత కుటుంబీలకు అభినందన…
- ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులకు ప్రశంస…
కర్నూలు, పల్లెవెలుగు: కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో బ్రెయిన్ డెడ్ అయిన మహిళకు మొదటిసారిగా అవయవ దానం చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన తెలియజేశారు. మంగళవారం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో గత కొంతకాలంగా అనారోగ్యం కారణంగా చికిత్స పొందుతూ ఫిబ్రవరి 5న బ్రెయిన్ డెడ్ గా డిక్లేర్ చేయబడిన కర్నూలు నగరానికి చెందిన గజ్జల పావని లత (వయస్సు 28) మహిళ అవయవాలను వారి కుటుంబ సభ్యులు దానం చేశారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన సమక్షంలో దానం చేసిన అవయవాలను హైదరాబాద్ కిమ్స్, విజయవాడ మణిపాల్ ఆస్పత్రులకు గ్రీన్ ఛానెల్స్ ద్వారా ప్రత్యేక ఏర్పాట్లు చేసి వాహనాల్లో తరలించారు.
గ్రీన్ ఛానెల్ ద్వారా… తరలింపు:
ఈ సందర్భంగా కలెక్టర్ జి. సృజన మాట్లాడుతూ జీవన్దాన్ లో రిజిస్టర్ చేసుకున్న వారి అవసరం మేరకు గజ్జల పావని లత కు సంబంధించిన ఊపిరితిత్తులను హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రి కి , కాలేయాన్ని విజయవాడ మణిపాల్ ఆసుపత్రికి గ్రీన్ ఛానెల్ ద్వారా ప్రత్యేక ఏర్పాట్లు చేసి పంపించడం జరిగిందని తెలిపారు.. అదే విధంగా రెండు మూత్రపిండాలలో కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి ఒకటి , కర్నూలు లోని కిమ్స్ ఆసుపత్రికి ఒకటి అందించడం జరిగిందని, కళ్ళను కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కి జీవన్దాన్ లో రిజిస్టర్ అయిన వారికి అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన మీడియా సమావేశం లో తెలియజేశారు.
కుటుంబీకులకు… అభినందన.. :
కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో నిష్టాతులైన డాక్టర్ల సహాయంతో , ఖరీదైన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుని గజ్జల పావని లత కు చెందిన కొన్ని అవయవాలను పోలీసు వారి సహాయంతో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకొని హైదరాబాద్ , విజయవాడ మరియు కర్నూలు ఆసుపత్రులకు పంపించడం జరిగిందని తెలిపారు. పావనిలత కోరిక మేరకు ఆమె తల్లిదండ్రులు , కుటుంబ సభ్యులు అవయవ దానానికి ముందుకు వచ్చినందుకు కర్నూలు జిల్లా కలెక్టర్ వారిని అభినందించారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అవయవదానం వల్ల బాధితులను ఆదుకోవడంతో పాటు చనిపోయిన వారిని బతికిఉన్నట్లు భావించవచ్చని కలెక్టర్ అభిప్రాయ పడ్డారు..
మూఢ నమ్మకాలతో…దానం చేయలేకపోతున్నారు… : సూపరింటెండెంట్ వెంకట రంగారెడ్డి
అనంతరం కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ వెంకట రంగారెడ్డి మాట్లాడుతూ మానవ శరీరంలోని అవయవాలను దాదాపు ఎనిమిది మందికి ఉపయోగించుకోవచ్చునని వీటిలో చిన్న పేగులు, పెద్ద పేగులు , క్లోమం మరియు ఇతర భాగాలు కూడా వినియోగించుకోవచ్చని తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పాల్గొన్న వైద్య సిబ్బందిని , రెడ్ క్రాస్ సిబ్బంది , పోలీసులను అభినందించారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెన్డెంట్ వెంకట రంగారెడ్డి , కార్డియో థోరాసిక్ సర్జన్ ప్రభాకర్ రెడ్డి , కర్నూలు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్ తదితరులు పాల్గొని వివరాలు తెలియజేశారు.